బాస్ తన వార్షిక సెలవులను రద్దు చేశాడన్న కోపంతో ఓ వ్యక్తి తన ఉద్యోగాన్నే వదిలేసిన విచిత్ర ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి బాస్‌కు, ఉద్యోగికి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణనల చిట్టాను మైఖేల్ సాంజ్ అనే టిక్‌టాక్ యూజర్ టిక్‌టాక్‌లో షేర్ చేశాడు. దాంతో సోషల్ మీడియాలో ఆ కన్వర్షేషన్ వైరల్‌గా మారింది. ఇంతకూ బాస్, ఉద్యోగి మధ్య జరిగిన ఆ ఆసక్తికరమైన సంభాషణల్లో ఏముందో ఇప్పుడు చూద్దాం..
మైఖేల్ సాంజ్ అనే టిక్‌టాక్ యూజర్ బ్యాడ్ బాస్ అనుభవాలకు సంబంధించిన స్టోరీలను టిక్‌టాక్‌లో షేర్ చేస్తుంటాడు. ఈ క్రమంలో వార్షిక సెలవులను రద్దు చేసుకోమనే సందర్భంలో ఆస్ట్రేలియాకు చెందిన నోయెల్ అనే ఉద్యోగి, నిక్ అనే బాస్‌కు మధ్య జరిగిన టెక్ట్స్ కన్వర్షేషన్ను ఆయన టిక్‌టాక్‌లో షేర్ చేశాడు. మరో ఉద్యోగి రిజైన్ చేసినందున మీ వార్షిక సెలవులను రద్దు చేస్తున్నామని, ఇంకో ఉద్యోగితో రిజైన్ చేసిన ఉద్యోగి స్థానాన్ని భర్తీ చేద్దామని అన్ని విధాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదని ఉద్యోగి నోయెల్‌కు తన బాస్ నిక్ టెక్ట్స్ మెసేజ్ పంపాడు.
‘వచ్చే వారం నుంచి మొదలయ్యే మీ వార్షిక సెలవులను కొన్ని నెలలపాటు వాయిదా వేసుకోండి. నేను హెచ్ఆర్తో మాట్లాడి మీ లీవ్ షెడ్యూల్‌ను మార్పిస్తాను. అర్థం చేసుకున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా’ అని బాస్ నిక్ నుంచి నోయెల్‌కు తొలి మెసేజ్ వచ్చింది. అయితే లీవ్ క్యాన్సిలేషన్ గురించి తనతో ఎలాంటి సంప్రతింపులు జరపకుండానే, కనీసం మాట మాత్రంగానైనా చెప్పకుండానే బాస్ లీవ్స్ క్యాన్సిల్ చేయడం, పైగా ముందే తన అంగీకారం తీసుకున్నట్లుగా ‘అర్థం చేసుకున్నందుకు అభినందిస్తున్నా’ అని పేర్కొనడంపై నోయెల్ ఒకింత అసహనానికి లోనయ్యాడు.
‘నేను ఈ వార్షిక సెలవుల్లో బాలిలో జరిగే నా సోదరుడి వివాహానికి వెళ్తున్నాను. ఇప్పటికే విమాన టికెట్లను బుక్ చేశాను. నా పిల్లలు ఆల్రెడీ వివాహ వేడుకల్లోనే ఉన్నారు. ఏడు నెలల క్రితమే నేను టికెట్లు బుక్ చేశాను. కాబట్టి సెలవులను రద్దు చేసుకోవడం కుదరదు. కావాలంటే నేను లీవ్‌లో వెళ్లేవరకు అదనంగా సాయపడమంటే సాయపడుతా. కానీ, నా లీవ్ షెడ్యూల్‌ను మాత్రం మార్చుకోలేను’ అని నోయెల్ రిప్లై ఇచ్చాడు.
దాంతో బాస్ నిక్ నుంచి నోయెల్‌కు మరో మెసేజ్ వచ్చింది. ‘మీరు బాలిలో మూడు వారాలు ఏం చేస్తారో నాకు అర్థం కావడంలేదు. మీ సోదరుడి వివాహానికి హాజరై రావడానికి మూడు రోజులు సరిపోతుంది. కాబట్టి మీ లీవ్స్‌ను మూడు వారాల నుంచి మూడు రోజులకు తగ్గించుకోండి’ అన్నది ఆ మెసేజ్ సారాంశం. దాంతో ‘కంపెనీ పరిస్థితి చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఇది మా ఫ్యామిలీ ట్రిప్. మా కుటుంబం అంతా కలిసి చాలా ఏళ్లయ్యింది. అయినా నేను మూడేళ్లుగా వార్షిక సెలవులు తీసుకోనే లేదు. పైగా నా సెలవులను నేను ఎక్కడ, ఎలా గడుపుతాననేది వేరెవరికీ సంబంధం లేని విషయం’ అని నోయెల్ సమాధానం ఇచ్చాడు.
ఆ వెంటనే ‘సాటి ఉద్యోగిగా చెబుతున్నా, ఎక్కువ ఒత్తిడికి లోనవకు. మీ సెలవులు రద్దయ్యాయి. ఇక నేనేం చేయలేను. క్షమించండి’ అని బాస్ నిక్ మరో మెసేజ్ పంపాడు. దాంతో నోయెల్ ‘నేను ఈ రోజు నుంచే లీవ్‌లో వెళ్తున్నాను. నేను పనిచేయగోరే కంపెనీ నా చుట్టూ పరిధులు గీయడం కరెక్ట్ కాదు’ అని రిప్లై ఇచ్చాడు. అంతటితో ఆ కన్వర్షేషన్ ముగిసిపోయిందని, దాన్ని బట్టి నోయెల్ తన ఉద్యోగాన్ని వదిలేశాడనేది స్పష్టమవుతోందని టిక్‌టాక్ యూజర్ మైఖేల్ సాంజ్ అభిప్రాయపడ్డాడు. మైఖేల్ షేర్ చేసిన ఈ కన్వర్షేషన్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. బాస్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా కామెంట్ల వర్షం కురిసింది.