RC 17 | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ అంటేనే సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అద్భుతమైన నటన, సుకుమార్ టేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కలిసి ఆ సినిమాను ఇండస్ట్రీ హిట్‌గా నిలబెట్టాయి. ఇప్పుడు అదే కాంబినేషన్లో మరో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుండటంతో మెగా అభిమానుల్లో ఎప్పటినుంచో ఆసక్తి నెలకొంది. రామ్ చరణ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా భావిస్తున్న ఈ సినిమాకు ప్రస్తుతం ‘RC17’ అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరిస్తున్నారు.
‘RC17’కు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ.. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై కొంతకాలంగా ఆసక్తి కొనసాగుతోంది. ‘పెద్ది’ షూటింగ్ సమయంలో రామ్ చరణ్ చేతికి గాయం కావడం, అనంతరం సర్జరీ జరగడంతో ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో RC17 షూటింగ్ ఆలస్యం అవుతుందనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. రాబోయే దసరా సందర్భంగా ఈ సినిమాకు గ్రాండ్‌గా ముహూర్త కార్యక్రమాలు నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు, ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ తేదీలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
‘RC17’ కథ విషయంలో సుకుమార్ మరోసారి తన మార్క్ చూపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ‘రంగస్థలం’లో రామ్ చరణ్‌ను పక్కా మాస్ విలేజ్ యువకుడిగా చూపించిన సుకుమార్.. ‘పుష్ప’లో అల్లు అర్జున్ను రగ్గడ్ మాస్ అవతార్‌లో ప్రెజెంట్ చేశారు. అయితే ఈసారి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా అర్బన్, అల్ట్రా-స్టైలిష్ బ్యాక్‌డ్రాప్‌లో రామ్ చరణ్‌ను చూపించేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ పాత్రకు తగ్గట్టుగా చరణ్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకోనున్నారని సమాచారం. ఇందులో భాగంగా ఆయన దాదాపు 15 కిలోల వరకు బరువు తగ్గనున్నారనే ప్రచారం జరుగుతోంది. ‘పెద్ది’లో పవర్ఫుల్ ఫిజిక్‌తో కనిపించనున్న చరణ్.. RC17లో మాత్రం లీన్, క్లాసీ, స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ మేకోవర్ నిజమైతే రామ్ చరణ్‌ను ఇంతకుముందెన్నడూ చూడని విధంగా సుకుమార్ చూపించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎవరు అనే విషయంలోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ‘డ్రాగన్’ ఫేమ్ రుక్మిణి వసంత్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.