Donald Trump | ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని కొనసాగించడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంసతృప్తి వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద వివాదంగా ఈ యుద్ధాన్ని అభివర్ణించారు. పుతిన్‌తో తనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని.. బహుశా ఇప్పటికే అలాగే ఉన్నాయని చెప్పుకొచ్చారు. పుతిన్ ఈ యుద్ధాన్ని ఎందుకు కొనసాగిస్తున్నాడో నాకు తెలియదని.. కానీ, యుద్ధం అంత మంచిది కాదన్నారు. అమెరికా అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశానికి ముందు.. ట్రంప్ వైట్‌హౌస్‌లో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేతో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం నాలుగు సంవత్సరాలుగా జరుగుతుందని.. ఈ యుద్ధం వారంలోనే పూర్తవ్వాల్సి ఉందని.. రష్యా 1.50లక్షల మంది సైనికులను కోల్పోయారన్నారు. ఇది భయంకరమైన యుద్ధమని.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన మరణాల పరంగా అతిపెద్ద సంఘటనగా పేర్కొన్నారు.
తాను ఇప్పటి వరకు ఎనిమిది యుద్ధాలను ఆపానని చెప్పుకొచ్చారు. తాను చాలా గొప్ప పనులు చేశానని.. ఈ యుద్ధాన్ని పూర్తిగా రష్యా, ఉక్రెయిన్ పరిష్కరించుకోవాలన్నారు. అర్జెంటీనా ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ట్రంప్ 20 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఉక్రెయిన్‌కు టోమాహాక్ క్షిపణులను ఇవ్వడానికి అమెరికా ఆలోచిస్తుందన్నారు. గతంలో ట్రంప్ పరిపాలన ఉక్రెయిన్‌కు టోమాహాక్ లాంగ్-రేంజ్ క్రూయిజ్ క్షిపణులను ఇవ్వడానికి ఆలోచిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ట్రంప్ ఇటీవల ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారం కాకపోతే, తాను టోమాహాక్స్ గురించి రష్యాతో మాట్లాడాల్సి ఉంటుందని.. వాటిని కైవ్‌కు పంపొచ్చన్నారు. సెప్టెంబర్ చివరలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం వైట్‌హౌస్ కైవ్‌కు టోమాహాక్ మిస్సైల్‌ను సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. ప్రతి మిస్సైల్ ధర 1.14 బిలియన్లు ఉంటుంది. వాటి పరిధి 2500 కిలోమీటర్లు. ఈ మిస్సైల్‌తో మాస్కోను మించి దాడి చేసే రేంజ్ వీటి సొంతం.