లాస్ ఏంజిల్స్: అమెరికా స్టార్టప్ కంపెనీ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీకి పెద్దపీట వేసింది. డిజైనర్ బేబీలను సృష్టించేందుకు ఆ కంపెనీ ప్రయోగాలు చేపడుతున్నది. సిలికాన్ వ్యాలీకి చెందిన బిలియనీర్లు ఆ ప్రాజెక్టు కోసం నిధులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. గర్భస్థ పిండాన్ని ఎడిటింగ్(Embryo Editing) చేసి .. జీన్ ఇంజనీరింగ్ బేబీని సృష్టించనున్నారు. వంశపారంపర్య రుగ్మతలు లేకుండా, హైయ్యర్ ఇంటెలిజెన్స్ ఉండే రీతిలో బేబీలను సృష్టించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ కథనాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ రాసింది.
వాస్తవానికి ఇప్పటికే జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నది. కానీ ప్రసవం అనంతరం చేపట్టే చికిత్స కోసం జీన్ ఎడిటింగ్ టెక్నాలజీని వాడుతున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రివెంటిన్ అనే స్టార్టప్ కంపెనీ జీన్ ఎడిటింగ్‌పై పనిచేస్తున్నది. జీన్ ఎడిటింగ్ సైంటిస్టు లూకాస్ హారింగ్టన్ ఆ కంపెనీ స్థాపించారు. ఓపెన్ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సామ్ ఆల్ట్మాన్, కాయిన్‌బేస్ కోఫౌండర్ బ్రియాన్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఈ ప్రాజెక్టుకు బ్యాకప్ ఇస్తున్నారు.
పుట్టుకకు ముందే గర్భస్థ పిండానికి జన్యుపరమైన ఎడిటింగ్ చేసి వారసత్వ వ్యాధులు రాకుండా చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు ప్రివెంటివ్ అనే సంస్థ పేర్కొన్నది. డిజైనర్ బీబీల కోసం ప్రయోగాలు జరుగుతున్నట్లు విషయం తెలియగానే ఆన్లైన్లో చర్చ మొదలైంది. ఎంబ్రియో ఎడిటింగ్‌కు అనుకూలమైన ప్రాంతం కోసం కంపెనీ అన్వేషిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో తెలిపింది. ఎంబ్రియో ఎడిటింగ్ కోసం 3 లక్షల డాలర్లు ఖర్చుచేయనున్నారు.
జీన్ ఎడిటింగ్‌తో పుట్టిన పిల్లల్లో బలహీనతలు తక్కువగా ఉంటాయని క్రిప్టోకరెన్సీ బిలియనీర్ ఆర్మ్‌స్ట్రాంగ్ తెలిపారు. ఆరోగ్యకరమైన ఇంజినీర్డ్ బేబీని ఆవిష్కరించి, ప్రజల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో చెప్పింది.