టెహ్రాన్, సెప్టెంబర్ 5: ఇరాన్ ప్రధాన చమురు కేంద్రం ఖర్గ్ ద్వీపంపై అమెరికా శనివారం దాడి చేసింది. అమెరికాతో పోరాటం మొదలైన కొద్ది రోజుల తర్వాత ఇరాన్ ఆయువుపట్టుపై యూఎస్ మళ్లీ దాడికి దిగింది. ఖర్గ్ ద్వీపంలో పెద్దయెత్తున పేలుళ్లు సంభవించాయని, తీరంలోని ఇరాన్ చమురు ట్యాంకర్ లక్ష్యంగా అమెరికా దాడులు చేసిందని ఇరాన్ మీడియా ఫార్స్ న్యూస్, ఎస్ఎన్ఎన్ న్యూస్‌లు వెల్లడించాయి.
ఒక వేళ తమ ఎగుమతులకు అడ్డుపడితే హొర్ముజ్ జలసంధి గుండా జరిగే చమురు రవాణాపై మరింత ఆంక్షలు విధిస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఖర్గ్ ద్వీపం ఇరాన్‌కు ప్రధాన చమురు ఎగుమతి కేంద్రంగా పనిచేస్తున్నది. రెండు దేశాల మధ్య ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఖర్గ్ ద్వీపంపై అమెరికా దాడి చేయడం ఇది మూడోసారి. కాగా, ఇరాన్‌కు చెందిన మూడు చమురు ట్యాంకర్లపై శనివారం దాడులు చేసినట్టు అమెరికా నిర్ధారించింది. ఈ దాడిలో తమవారెవ్వరూ గాయపడలేదని, క్షిపణి దాడులను తమ యుద్ధనౌకలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయని పేర్కొంది.
పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం: ట్రంప్
పికాక్స్ మౌంటేన్ అని పిలిచే ఇరాన్ భూగర్భ అణు స్థావరాన్ని అమెరికా అతి త్వరలో లక్ష్యంగా చేసుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా తాజా దాడుల తర్వాత ఈ హెచ్చరిక వెలువడింది. అణు ఆయుధాన్ని తయారు చేయకుండా ఇరాన్‌ను అడ్డుకునేందుకు నెలల తరబడి కొనసాగించిన సైనిక చర్యను శుక్రవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ సమర్థించుకున్నారు.
ఇరాన్ వద్ద అణు ఆయుధం ఉండదు. ఎందుకంటే ఒకవేళ అది వారి వద్ద ఉండి ఉంటే బహుశా మీరు ఇక్కడ ఎక్కువ సేపు నిలబడి ఉండేవారు కాదు అని విలేకరులను ఉద్దేశించి ట్రంప్ అన్నారు. “పికాక్స్ మౌంటేన్లో ప్రతి ఒక్కరి కదలికలు మాకు తెలుసు. ఇరాన్ అంతటా సంచరిస్తున్న ప్రతి ఒక్కరూ మాకు తెలుసు. పరిస్థితి చేయిదాటితే వారిపై దాడి చేస్తాము. గట్టిగా దెబ్బతీస్తాము అని ట్రంప్ హెచ్చరించారు.