టెహ్రాన్ : త్వరలో ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరవచ్చని ప్రచారం జరుగుతున్న సమయంలో ఇరాన్‌లోని దక్షిణ ప్రాంతాలపై అమెరికా తీవ్ర దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. దక్షిణ ఇరాన్లో క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్స్ అమర్చుతున్న పడవలపై తాము ఆత్మరక్షణ దాడులు నిర్వహించినట్టు అమెరికా సైన్యం తెలిపింది. మరోవైపు టెహ్రాన్‌తో చర్చలు చాలా బాగా సాగుతున్నాయని దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఉన్నతస్థాయి ఇరాన్ ప్రతినిధి బృందం అమెరికాతో శాంతి చర్చల కోసం దోహాలో ఉన్న సమయంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. పడవలపై అమెరికా జరిపిన దాడుల్లో నాలుగు దళాలకు చెందిన గార్డ్స్ చనిపోయినట్టు ఇరాన్‌కు చెందిన ‘తబ్నాక్’ అనే వెబ్సైట్ గుర్తించింది. హొర్ముజ్ జలసంధి సమీపంలోని మిలిటరీ పోర్టు, విమానాశ్రయం ఉన్న బందర్ అబ్బాస్ నగరం చుట్టుపక్కల పేలుళ్లు చోటుచేసుకొన్నాయని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. వారాల తరబడి కొనసాగుతున్న కాల్పుల విరమణను ఈ తాజా దాడులు కుదిపేశాయి.
పశ్చిమాసియాలో అమెరికా బేస్‌లకు ప్రాంతీయ శక్తులు ఇకపై రక్షణ కవచంగా పనిచేయబోవని, అమెరికాకు అక్కడ సురక్షిత ప్రాంతం ఉండబోదని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మంగళవారం హెచ్చరించారు. ఈ ప్రాంతంలో యూఎస్ తన ప్రభావాన్ని కోల్పోతున్నదని, రోజురోజుకూ అది తన పూర్వస్థితికి మరింత దూరమవుతున్నదని ఆయన అన్నారు. అమెరికా కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే దానికి సమాధానం చెప్పే హక్కు తమకు ఉందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా తూట్లు పొడిచిందని ఇరాన్ విదేశాంగ శాఖ దుయ్యబట్టింది. ప్రతిదాడులకు దిగుతామని అమెరికాను హెచ్చరించింది.
అంతకుముందు ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ తన యురేనియంను నాశనం చేయడానికి అప్పగిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ పర్యవేక్షణతో ఇరాన్‌లోనే దానిని నాశనం చేసే అవకాశాన్ని ఆయన ప్రతిపాదించారు. ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి జరిగే ఏవైనా ఒప్పందాలలో సౌదీ అరేబియా, పాకిస్థాన్లతో సహా మరికొన్ని అదనపు దేశాలు ‘అబ్రహం ఒప్పందాలు’లో చేరాలనే నిబంధనను చేర్చాలని అన్నారు. ట్రంప్ చేసిన తాజా ప్రతిపాదన చర్చలను మరింత క్లిష్టం చేసే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే ఆయన పేర్కొన్న కొన్ని దేశాలకు ఇజ్రాయెల్‌తో సంబంధాలపై దీర్ఘకాలిక షరతులు లేదా సున్నితత్వాలు ఉన్నాయి. 2020లో బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అబ్రహం ఒప్పందంలో చేరి ఇజ్రాయెల్‌ను దౌత్యపరంగా గుర్తించిన మొదటి దేశాలుగా నిలిచాయి. సౌదీ అరేబియా ఇందులో చేరాలని ట్రంప్ చాలా కాలంగా ఆశిస్తున్నారు. అయితే సౌదీ అరేబియా దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌ను 1967 నాటి సరిహద్దులకు తిరిగి వెళ్లాలని, తూర్పు జెరూసలేం రాజధానిగా పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తున్నది. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేని పాకిస్థాన్ కూడా తన వైఖరిని పాలస్తీనా సమస్యతో ముడిపెట్టింది. ట్రంప్ తాజా ప్రతిపాదన చేసినప్పటికీ, ఇజ్రాయెల్‌పై పాకిస్థాన్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఇస్లామాబాద్‌కు చెందిన విశ్లేషకులు సయ్యద్ మహ్మద్ అలీ తెలిపారు. అమెరికాలో పాకిస్థాన్ మాజీ రాయబారి మసూద్‌ఖాన్ మాట్లాడుతూ ట్రంప్ జాబితాలోని దేశాలకు ఈ ప్రతిపాదన ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాల్సి ఉందని అన్నారు.