వాషింగ్టన్ : ఒక పక్క సంక్షోభం, పునరుద్ధరణ పేరుతో టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసనలు పలుకుతుండగా, భారత్ టెక్ దిగ్గజం టీసీఎస్ అమెరికాలో హెచ్-1బీ వీసాల కింద అంత మంది విదేశీయులను ఎందుకు నియమించుకుందని అమెరికా సెనేటర్లు ప్రశ్నించారు. అమెరికన్లను తొలగించి ఆ స్థానంలో హెచ్-1బీ వీసాదారులను నియమించుకుంటున్నదని ఆరోపించారు.
యూఎస్ సెనేటర్లు ఈ గ్రాస్సెలీ, రిచర్డ్ జీ డర్బిన్లు టీసీఎస్ సీఈవో కృతి కృతివాసన్‌కు సెప్టెంబర్ 24న ఈ విషయమై లేఖ రాశారు. వందలు, వేల కొద్దీ ఉద్యోగులను టెక్ కంపెనీలు తొలగిస్తున్న వేళ టీసీఎస్ అంత మంది విదేశీ సాంకేతిక నిపుణులను ఎందుకు నియమించుకుంది? హెచ్-1బీ వీసా ద్వారా విదేశీయులను నియమించుకునే ముందు ఆ పోస్టులను స్థానికంగా ఉన్న అమెరికన్లతో భర్తీ చేసే నిజాయితీ ప్రయత్నమేదన్నా టీసీఎస్ చేసిందా?
చేస్తే అవి ఏంటి?.. అప్పటి దాకా పనిచేస్తున్న అమెరికన్ ఉద్యోగులను తొలగించి, వారి స్థానాన్ని హెచ్-1బీ ఉద్యోగులతో భర్తీ చేసిందా? అమెరికా ఉద్యోగులకు సమానమైన వేతనాన్ని చెల్లిస్తున్నారా? చెల్లిస్తే ఆ వివరాలు ఇవ్వండి, ఇప్పుడు పనిచేస్తున్న హెచ్-1బీ వీసాదారుల్లో టీసీఎస్ ఎంతమందికి నేరుగా జీతాలు చెల్లిస్తున్నది? అని వారు టీసీఎస్‌ను ప్రశ్నిస్తూ లేఖ రాశారు.