US Primary Elections: అగ్రరాజ్యం అమెరికాలో ఈ సంవత్సరం అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార డెమోక్రటిక్ పార్టీ, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాల కోసం ప్రైమరీ ఎన్నికలు జరుగుతున్నాయి. సౌత్ కరోలినా డెమోక్రాటిక్ ప్రైమరీ ఎన్నికల్లో అధ్యక్షుడు జో బైడెన్ ఘన విజయం సాధించారు. బెడైన్‌కు ఇద్దరు అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చివరికి ఆయనే గెలిచారు.
దాదాపు 55 మంది డెలిగేట్లు ఈ పోటీలో ఉన్నప్పటికీ తొలి నుంచి బైడెన్‌దే విజయమని అంతా భావించారు. అంతా అనుకున్నట్టుగానే బైడెన్ విజయాన్ని అందకున్నారు. ఈ పోటీలో మారియన్ విలియమ్సన్, డీన్ ఫిలిప్స్‌లు బైడెన్‌కు గట్టి పోటీ ఇచ్చారు. సౌత్ కరోలినా ప్రైమరీలో విజయం సాధించిన సమయంలో బైడెన్ లాస్ ఏంజెల్స్‌లో నిధుల సేకరణ కార్యక్రమంలో ఉన్నారు.
సౌత్ కరోలినాలో విజయంపై బైడెన్ స్పందిస్తూ.. ‘ఎన్నికల ప్రచారానికి సౌత్ కరోలినా ఓటర్లు కొత్త జోష్ తీసుకొచ్చారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లోనూ ఓటర్లు మాకు పూర్తి మద్దతు తెలిపారు. ఇప్పుడు కూడా సౌత్ కరోలినా ప్రజలు మరోసారి అదే రకమైన తీర్పునిచ్చారు. ట్రంప్‌ను ఓడించేలా మమ్మల్ని నడిపించారనడంలో ఎలాంటి సందేహం లేదు’ అన్నారు. ఇదిలావుంటే.. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్, బైడెన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అవకాశం ఉన్న ప్రతిసారి విమర్శలు చేసుకుంటున్నారు.