Donald Trump | వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య పోరును ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని ట్రంప్ గట్టిగా నిర్ణయించారు. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం చేసుకునేంత వరకు రష్యాపై పెద్దయెత్తున ఆంక్షలు, సుంకాలు విధిస్తామంటూ శుక్రవారం ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ను హెచ్చరించారు. ఇంకా ఆలస్యం కాకముందే ఇద్దరూ చర్చల వేదికపైకి రావాలంటూ ఇరు దేశాల అధ్యక్షులకు స్పష్టమైన సందేశాన్ని పంపారు. కాగా, 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగిన వెంటనే అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యాపై పలు ఆంక్షలను విధించారు. అయితే ఇటీవల జెలెన్స్కీతో చర్చల సందర్భంగా ట్రంప్ వైఖరిని చూసిన ప్రపంచ దేశాలు రష్యాతో మైత్రికి ఆయన తహతహలాడుతున్నారని ఊహించాయి. ఈ క్రమంలో ఆయన ఆ దేశంపై గతంలో విధించిన ఆంక్షలను సడలిస్తారని, అనుకూల వైఖరిని అవలంబిస్తారని కథనాలు వచ్చాయి. అయితే ట్రంప్ తాజా ప్రకటన వారికి షాకిచ్చింది.
అణు ఒప్పందంపై చర్చిద్దాం..ఇరాన్‌కు ట్రంప్ లేఖ
అణు ఒప్పందంపై ఇరాన్‌తో చర్చలు జరపాలని ఆశిస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. అణు ఒప్పందంపై చర్చించేందుకు అంగీకరించాలని కోరుతూ ఇరాన్ నాయకత్వానికి గురువారం ట్రంప్ ఓ లేఖ రాశారు. చర్చలకు ఇరాన్ అంగీకరిస్తుందని భావిస్తున్నానని, అది ఇరాన్‌కే మేలని తాజా ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు.