వాషింగ్టన్: తోమాహాక్ లాంగ్ రేంజ్ మిస్సైళ్ల(Tomahawk Missiles)ను ఉక్రెయిన్‌కు అప్పగించేందుకు అమెరికా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఇది కీలకంగా మారనున్నది. యుద్ధానికి కొత్త తరహా దూకుడును తెస్తుందని ట్రంప్ అన్నారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఇజ్రాయిల్ వెళ్తున్న సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌కు తోమాహాక్ క్షిపణులను పంపిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ చూస్తామని చెప్పారు. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ట్రంప్ మధ్య రెండోసారి ఫోన్ సంభాషణ జరిగింది. రష్యాపై దాడి చేస్తున్న తమకు అమెరికా సాయం చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు జెలెన్స్కీ తెలిపారు.
అయితే ఒకవేళ ఉక్రెయిన్‌కు తోమాహాక్ మిస్సైళ్లను అందిస్తే, అప్పుడు ఆ యుద్ధంలో అమెరికా ప్రమేయం కూడా ఉన్నట్లు అవుతుందని రష్యా వార్నింగ్ ఇచ్చింది. తొమాహాక్ మిస్సైళ్లకు 2500 కిలోమీటర్ల రేంజ్ ఉన్నది. అంటే ఉక్రెయిన్ నుంచి ప్రయోగిస్తే ఆ క్షిపణులు మాస్కో చేరే ఛాన్సు ఉంది. తోమాహాక్ మిస్సైళ్ల గురించి ఉక్రెయిన్ చేసిన రిక్వెస్ట్ అంశాన్ని రష్యాతో చర్చించనున్నట్లు కూడా ట్రంప్ వెల్లడించారు. ఒకవేళ యుద్ధంపై రష్యా, ఉక్రెయిన్ మధ్య ఒప్పందం కుదరకుంటే, అప్పుడు తోమాహాక్ అప్పగింత గురించి ఆలోచించాల్సి ఉంటుందన్నారు.