వాషింగ్టన్, జూన్ 25: ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పునరుద్ధరించుకోవాలని ప్రయత్నిస్తే మళ్లీ దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ఇక యురేనియం శుద్ధి జోలికి పోదని, అది వారు చేసే చివరి పని అవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ ఇప్పట్లో ఇరాన్ బాంబులు తయారు చేయబోదని అన్నారు. స్థావరాల నుంచి అణు పదార్థాలను సకాలంలో తొలగించేంత సమయం ఇరాన్‌కు ఉందని తాను భావించడం లేదని, అణు స్థావరాలపై భారీ స్థాయిలో దాడి జరిగిందని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా బాంబు దాడులకు ముందే ఇరాన్ తన అణు స్థావరాల నుంచి 400 కిలోల యురేనియం నిల్వలను వేరే చోటుకు తరలించిందంటూ వెలువడిన వార్తలను ట్రంప్ అంతకు ముందు తోసిపుచ్చారు. అవి తప్పుడు వార్తలని ఆయన వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు ట్రంప్‌ను తక్కువ చేసి చూపేందుకే ఆ వార్తలను సృష్టించినట్లు వైట్ హౌస్ విమర్శించింది.
అణు స్థావరాలు ధ్వంసం కాలేదు!
అమెరికా వైమానిక దాడులు ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని పూర్తిగా నిర్మూలించాయన్న ట్రంప్ ప్రభుత్వ వాదనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నిఘా సంస్థ ఇచ్చిన తాజా నివేదికపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. సీఎన్ఎన్ బయటపెట్టిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(డీఐఏ) ఇచ్చిన నివేదికలో అమెరికా జరిపిన దాడులు ఇరాన్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని పూర్తిగా నిర్మూలించలేదని, కేవలం కొన్ని నెలలపాటు వెనక్కు నెట్టిందని పేర్కొన్నారు. ఇరాన్‌కు చెందిన మూడు అణు పరిశోధనా కేంద్రాలలో మౌలిక సదుపాయాలు చెక్కుచెదరలేదని తెలిపారు. కాగా, నిఘా సంస్థ నివేదికను నకిలీ అని కొట్టిపారేసిన ట్రంప్ ఇది సైనిక దాడిని కించపరిచే లక్ష్యంతో తయారుచేసిందని విమర్శించారు. చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సైనిక దాడులను కించపరిచే ప్రయత్నంలో ఫేక్ న్యూస్ సీఎన్ఎన్, విఫల న్యూయార్క్ టైమ్స్ కుమ్మక్కయ్యాయని ట్రంప్ ఆరోపించారు. ఇరాన్‌లోని అణు స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, నకిలీ వార్తలు రాసిన టైమ్స్, సీఎన్ఎన్పై ప్రజలు మండిపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.