వాషింగ్టన్, ఫిబ్రవరి 22: అమెరికాలో గత ఏడాది ప్రమాదవశాత్తు మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి కేసులో సియాటెల్ పోలీస్ అధికారి కెవిన్ డేవ్పై క్రిమినల్ అభియోగాలు మోపడం లేదు. ప్రమాదానికి తగిన ఆధారాలు లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ అత్యవసర కాల్ రావడంతో దాన్ని పరిష్కరించడానికి కెవిన్ డేవ్ వెళ్తుండగా ఆయన వాహనం ఢీకొని జాహ్నవి మృతి చెందింది. ఈ కేసులో అన్ని వివరాలను పరిశీలించిన తర్వాత జాహ్నవి మృతికి గల కారణాల్లో కెవిన్పై సమంజసమైన సందేహం కలగనందున ఆయనపై క్రిమినల్ అభియోగాలుండవని ప్రాసిక్యూటింగ్ కార్యాలయం తెలిపింది. అయితే జాహ్నవి మృతిని తక్కువ చేస్తూ హేళనగా మాట్లాడిన మరో పోలీస్ అధికారి డేనియల్ అడెరెర్ వ్యాఖ్యలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పింది. అతడిపై తుది చర్యలకు సంబంధించిన విచారణను మార్చి 4న చేపడతామని కోర్టు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన జాహ్నవి(23) నార్త్ఈస్ట్రన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ డిగ్రీ చేయడానికి అమెరికా వెళ్లారు. గత ఏడాది జనవరి 23న ఆమె రోడ్డు దాటుతున్నప్పుడు 119 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీ కొనడంతో ఆమె 100 అడుగుల దూరం ఎగిరి పడ్డారు. అదే రోజు రాత్రి ఆమె మృతి చెందారు. ఈ కేసు దర్యాప్తుపై పోలీస్ అధికారి అడెరెర్ మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అయింది. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి. ఆమె చావుకు విలువ లేదు’ అన్నట్టు చులకనగా ఆయన మాట్లాడారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది.