Visa Ban | ఓ భారత సంతతికి చెందిన ట్రక్ డ్రైవర్ కారణంగా అమెరికాలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాతం తీవ్ర చర్చలకు దారి తీసింది. ఫ్లోరిడాలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విదేశాల నుంచి వాణిజ్య రవాణా కోసం వచ్చే డ్రైవర్లకు జారీ చేసే వర్క్ వీసాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. ‘విదేశీ వాణిజ్య ట్రక్ డ్రైవర్లకు ఇచ్చే అన్ని వర్కర్ వీసాలను తక్షణమే నిలిపివేస్తున్నాం. అమెరికా రోడ్లపై విదేశీ డ్రైవర్ల సంఖ్య పెరుగుతోందన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆయన తెలిపారు. ఇటీవల ఫ్లోరిడాలో చోటుచేసుకుంది.
హర్జిందర్ సింగ్ అనే భారత సంతతికి చెందిన ట్రక్ డ్రైవర్ నిబంధనలకు విరుద్ధంగా యూ-టర్న్ తీసుకోవడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. హర్జిందర్ సింగ్ మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించి.. ఆపై ఫ్లోరిడాలో కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్టు తెలుస్తోంది. ప్రమాదం అనంతరం నిర్వహించిన ఇంగ్లీష్ టెస్ట్‌లోనూ విఫలమైనట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు అమెరికా మీడియా పెద్ద ఎత్తున కవరేజ్ ఇచ్చింది. హర్జిందర్ సింగ్ డెమొక్రాట్లు అధికారంలో ఉన్న కాలిఫోర్నియాలో నివసిస్తూ అక్కడే వాణిజ్య లైసెన్స్ పొందాడు. దీంతో ట్రంప్ ప్రభుత్వం కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో న్యూసమ్ కార్యాలయం స్పందిస్తూ.. ‘సింగ్‌కు వర్క్ పర్మిట్ జారీ చేసింది ట్రంప్ ప్రభుత్వం కావడం విశేషం. అతడిని అరెస్ట్ చేసి అప్పగించే విషయంలో పూర్తి సహకారం అందించాం’ అని తెలిపింది. ఈ పరిణామాలు వలస విధానాలపై తిరిగి దృష్టి మళ్లించాయి. అమెరికాలో వాణిజ్య రవాణా రంగంలో విదేశీ డ్రైవర్లపై కొత్త ఆంక్షలు వచ్చే అవకాశం ఉంది.