వాషింగ్టన్: అమెరికాలో నేవీ విమానం (Naval aircraft) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు క్షేమంగా బయటపడగా, మరొకరు గల్లంతయ్యారు. యూఎస్ నేవికి చెందిన ఓస్ప్రే అని భారీ విమానం బుధవారం రాత్రి 7.45 గంటల సమయంలో వర్జీనియాలోని అకొమాక్ కౌంటీలో ఉన్న చింకోటీగులోని ఓ నదిలో కుప్పకూలింది. దీంతో ఇద్దరు కిందికి దూకేయగా, మరొకరు తప్పిపోయారని అధికారులు తెలిపారు. వారిద్దరికి కాళ్లు విరిగిపోయాయని చెప్పారు. తప్పిపోయిన సైనికుడి కోసం కోస్ట్‌గార్డు సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారని వెల్లడించారు. అయితే ప్రమాద సమయంలో విమానంలో ఎంత మంది ఉన్నారనే విషయంలో స్పష్టతలేదని పేర్కొన్నారు.
ఈ నెల ప్రారంభంలోకూడా ఇలాంటి ప్రమాదమే నార్వేలో జరిగింది. సైన్యానికి చెందిన ఎంవీ 22బీ విమానం కుప్పకూలిపోయింది. దీంతో నలుగురు సిబ్బంది దుర్మరణం చెందారు.