US National Bird | వాషింగ్టన్, ఆగస్టు 7: అమెరికా జాతీయ పక్షిగా ‘బాల్డ్ ఈగల్’ను గుర్తిస్తూ ఆ దేశ సెనెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 240 ఏండ్లుగా ఈ పక్షిని అమెరికాలో అధికార చిహ్నంగా వాడుతున్నా, జాతీయ పక్షి హోదా మాత్రం ఇప్పటివరకు దక్కలేదు. రెండు వందల ఏండ్లకుపైగా ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ, సెనెట్ (పార్లమెంట్ ఎగువసభ) జాతీయ పక్షిని తాజాగా ఖరారు చేసింది.
ఇందుకు సంబంధించిన బిల్లుకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. మిన్నెసోటా డెమొక్రాట్ ఎమి క్లోబుచర్ బిల్లును ప్రతిపాదించగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ‘గత 240 ఏండ్లుగా అమెరికా విలువలకు ‘బాల్డ్ ఈగల్’ ఒక చిహ్నంగా నిలిచింది. ఇన్నేండ్లకు జాతీయ పక్షిగా గుర్తింపు లభించింది’ అని సెనెటర్ ల్యూమిస్ అన్నారు. అమెరికా ఏర్పడినప్పుడు ఆ దేశ రూపకర్తలు ‘బాల్డ్ ఈగల్’నే గుర్తుగా ఎంచుకున్నారు. 1940లో ఈ పక్షుల్ని వేటాడటంపై నిషేధం విధించారు.