Israel-Hamas War | వాషింగ్టన్/టెహ్రాన్/టెల్అవివ్, ఆగస్టు 5: ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత పది నెలలుగా కొనసాగుతున్న యుద్ధం మరింత విస్తృతం కానున్నదనే అంచనాల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. గతవారం ఇజ్రాయెల్ వేర్వేరుగా జరిపిన దాడుల్లో ఇరాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, లెబనాన్‌లోని బీరుట్లో హెజ్బొల్లా టాప్ కమాండర్ ఫాద్ షుక్రు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్, హెజ్బొల్లా ప్రకటించిన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఏ క్షణంలో ఎక్కడి నుంచి దాడులు జరుగుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది.
తాజా పరిస్థితులపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ జీ7 దేశాల మంత్రులతో మాట్లాడినట్టు సోమవారం అమెరికా మీడియా వెల్లడించింది. ఇరాన్, హెజ్బొల్లా రానున్న 24 నుంచి 48 గంటల్లో ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉన్నట్టు ఆయన చెప్పినట్టు తెలిపాయి. ఉద్రికత్తలను చల్లార్చేందుకు, దాడులను తగ్గించేందుకు ఇరాన్, హెజ్బొల్లాను ఒప్పించేలా అమెరికా ప్రయత్నం చేస్తున్నదని బ్లింకెన్ వారికి వివరించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తూ జీ7 దేశాల విదేశాంగ మంత్రులు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
తాజా పరిణామాల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నస్సీర్ కనాని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలని తాము అనుకోవడం లేదని, అయితే తదుపరి అస్థిరత పరిస్థితులను నియంత్రించేందుకు ఇజ్రాయెల్‌ను తగిన విధంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. తమ దేశ రాజధాని టెహ్రాన్‌లో హనియాను హత్య చేయడం అంతర్జాతీయ చట్ట ఉల్లంఘన అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ జాతీయ భద్రత, సార్వభౌమాధికారాన్ని సంరక్షించుకొనే హక్కు ఇరాన్‌కు ఉన్నదని అన్నారు.
మరోవైపు ప్రస్తుత సమయంలో ఇజ్రాయెల్‌కు అండగా నిలవాలని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి యోవ్ గాల్లంట్ తమ మిత్ర దేశాలను కోరారు. ఇరాన్, దాని మద్దతు గ్రూపుల నుంచి పొంచివున్న ముప్పుపై ఇటలీ రక్షణ శాఖ మంత్రితో మాట్లాడినట్టు గాల్లంట్ సోమవారం ఎక్స్ పోస్టులో వెల్లడించారు.
ఇజ్రాయెల్, లెబనాన్, పాలస్తీనాకు ప్రయాణాలు చేయొద్దని ఐర్లాండ్ ప్రధాన మంత్రి సిమన్ హారిస్ తమ దేశ పౌరులకు సూచించారు. లెబనాన్‌లోని తమ పౌరులు ఆ దేశాన్ని వీడాలని జపాన్ విదేశాంగ శాఖ కూడా హెచ్చరికలు చేసింది. ఇదేవిధంగా ఇప్పటికే పలు దేశాలు అడ్వైజరీ జారీచేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ నెల 7 వరకు తాము ఇరాన్, ఇరాక్ గగనతలాన్ని వినియోగించబోమని జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ తెలిపింది. పశ్చిమాసియాలో తక్షణం ఉద్రిక్తతలు తగ్గాల్సిన అవసరం ఉన్నదని ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ తుర్క్ పిలుపునిచ్చారు.
పశ్చిమాసియాలో తాజా పరిస్థితులపై సమీక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ భద్రతా మండలితో సమావేశం కానున్నట్టు వైట్‌హైస్ వెల్లడించింది. జోర్డాన్ రాజు అబ్దుల్లాతోనూ ఆయన చర్చించనున్నట్టు తెలిపింది.