న్యూఢిల్లీ: ఇరాన్ అణ్వాయుధాలు తయారీ చేస్తున్నదని, శరవేగంగా ఆ దిశగా అడుగులు వేస్తున్నదని, ఆ దేశాన్ని కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇజ్రాయిల్ దాడులకు దిగిన విషయం తెలిసిందే. అయితే దీనిలో భాగంగానే ఇరాన్లో ఉన్న పలు అణు కేంద్రాలపై అటాక్ కూడా చేసింది. నటాంజ్ భూగర్భ అణు కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయిల్ చెప్పింది. కానీ కొండల్లో ఉన్న ఫోర్డో అణు కేంద్రాన్ని(Fordo Nuclear Plant) .. ఇజ్రాయిల్ దాడులు ఏమీ చేయలేకపోయినట్లు తెలుస్తోంది. భూగర్భంలో సుమారు 295 అడుగుల లోతులో యురేనియం శుద్దీకరణ జరుగుతున్నట్లు కొన్ని ఏజెన్సీల ద్వారా సమాచారం అందుతోంది.
అయితే ఇలాంటి అణు బంకర్‌ను.. ఏరియల్ దాడితో ధ్వంసం చేయడం కష్టేమే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బంకర్‌ను పేల్చే బాంబులు ఇజ్రాయిల్ వద్ద లేవని ఓ వాదన వినిపిస్తున్నది. అమెరికా వద్ద ఆ బాంబులు ఉన్నట్లు కొన్ని కోణాల్లో వార్తలు వ్యాపిస్తున్నాయి. అమెరికా వద్ద ఉన్న జీబీయూ-57 ఏ-బీ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబును వాడాలని ఇజ్రాయిల్ భావిస్తున్నది. దీని కోసమే అమెరికా మద్దతును ఇజ్రాయిల్ ఆశిస్తున్నట్లు కొన్ని మీడియా కథనాలు వెలుబడుతున్నాయి. జీబీయూ 57 బాంబు సుమారు 14 వేల కిలోల బరువు ఉంటుంది. కేవలం బీ2 స్టీల్త్ బాంబర్లు మాత్రమే దీన్ని పేల్చే అవకాశాలు ఉన్నాయి.
అమెరికాకు చెందిన జేబీయూ 57 బంకర్ బస్టర్ బాంబు.. సుమారు 60 మీటర్ల లోతులోకి వెళ్లిన తర్వాత పేలుతుంది. బాంబులను పేల్చుతూ డ్రిల్లింగ్ చేస్తే మరింత లోతుల్లోకి వెళ్లే బంకర్‌ను పేల్చే అవకాశాలు ఉన్నాయి. ఫోర్డో అణు కేంద్రంలో అత్యంత శుద్ధి చెందిన యురేనియంను వాడుతున్నారని, ఒకవేళ అక్కడ బంకర్లను పేల్చితే దాని వల్ల తీవ్ర స్థాయి రేడియేషన్ వెలుబడే అవకాశాలు ఉన్నట్లు అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అభిప్రాయపడింది.
కేవలం మిస్పైళ్లతో ఫోర్డో అణు కేంద్రాన్ని కూల్చడం సాధ్యం అయిన విషయం కాదు అని, ఇరాన్ చేపడుతున్న మిస్సైల్, న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను నిర్వీర్యం చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇరాన్‌పై తాము చేపట్టిన ఆపరేషన్ .. ఫోర్డో అణు కేంద్రం కూల్చివేతతో పూర్తి అవుతుందని ఇజ్రాయిలీ అంబాసిడర్ యెచిల్ లీటర్ ఇటీవల పేర్కొన్నారు.