గాజా: రఫా(Rafah)లోని సెటిల్మెంట్ క్యాంపుపై ఆదివారం ఇజ్రాయిల్ అటాక్ చేసింది. ఆ అటాక్ కోసం అమెరికా తయారు చేసిన బాంబులను వాడినట్లు తెలుస్తోంది. పేలుడు పదార్ధాల నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ విషయాన్ని అంచనా వేశారు. గాజా దక్షిణం వైపున ఉన్న నగరంపై జరిగిన ఇజ్రాయిల్ సైనిక దాడిలో సుమారు 45 మంది మరణించారు. 200 మంది గాయపడినట్లు గాజా హెల్త్ మినిస్ట్రీ పేర్కొన్నది. మృతిచెందినవారిలో ఎక్కువ శాతం మహిళలు, చిన్నారులు ఉన్నారు. రఫా క్యాంపులో భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. చిన్నారులు, మహిళలకు చెందిన కాలిన దేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. రఫాలో సుమారు 13 లక్షల మంది పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారు.
మంగళవారం కూడా ఇజ్రాయిల్ దళాలకు చెందిన యుద్ధ ట్యాంకులు రఫా నగరంలోకి ప్రవేశించాయి. హమాస్‌పై యుద్ధం ప్రకటించి ఏడు నెలల గడిచిన తర్వాత తొలిసారి ఇజ్రాయిల్ ట్యాంకులు రఫాలోకి వెళ్లాయి. దీంతో ఇజ్రాయిల్ చేపడుతున్న యుద్ధం కొత్త దశకు చేరుకున్నట్లు అంచనా వేస్తున్నారు. రఫాపై దాడి జరిగిన అంశంలో మాత్రం అమెరికా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇజ్రాయిల్ ఆ దాడి విషయంలో రెడ్‌లైన్ దాటలేదని అమెరికా పేర్కొన్నది. బోయింగ్ సంస్థ తయారు చేస్తున్న జీబీయూ-39 బాంబులను రఫాపై అటాక్ కోసం ఇజ్రాయిల్ వాడినట్లు తెలుస్తోంది.