న్యూఢిల్లీ, ఆగస్టు 25 : అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సామూహిక వీసా రద్దుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. అమెరికాలో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్న లేదా ప్రస్తుతం ఆశ్రయం కోరుతున్న దాదాపు 2 లక్షల మంది విదేశీయుల వ్యాపార, పర్యాటక వీసాలను రద్దు చేయడానికి ట్రంప్ యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఆశ్రయం కోరిన లేదా ప్రస్తుతం ఆశ్రయం కోసం ప్రయత్నిస్తున్న వారికి 2016, 2026 మధ్య జారీచేసిన బీ1, బీ2 వీసాలు దీని పరిధిలోకి వస్తాయని అధికారుల సమాచారం ఆధారంగా ఏపీ వార్తా సంస్థ పేర్కొంది.
స్వల్పకాలిక సందర్శకులుగా అమెరికాకు వచ్చి ఆ తర్వాత ఇక్కడే శాశ్వతంగా నివసించడానికి ఆశ్రయం(అసైలం) కోరుతూ దరఖాస్తు చేసుకునే విదేశీయులను గుర్తించి వీసాలను రద్దు చేస్తాం అని విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్ తెలిపారు. అయితే రద్దు చేయనున్న వీసాల సంఖ్యను ఆయన నిర్ధారించలేదు. ఇది నిరంతర పద్ధతిలో కొనసాగుతుందని ఆయన తెలిపారు. కాగా, గత 18 నెలల్లో మద్యం సేవిస్తూ వాహనం నడపడం, లైంగిక దాడి, దోపిడీ వంటి నేరాలకు పాల్పడినట్టు నిర్ధారణ అయినవారు లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, అలాగే ఆమెరికా విధానాలను బహిరంగంగా వ్యతిరేకించిన వారితో సహా సుమారు 1.75 లక్షల మంది వీసాలను యంత్రాంగం ఇప్పటికే రద్దు చేసింది.
వలస విధానాలు కఠినతరం అవుతున్న నేపథ్యంలో అమెరికా కళాశాలల్లో ప్రవేశం కోరే భారతీయ విద్యార్థుల సంఖ్య 2025-26లో అంతకుముందు ఏడాదితో పోలిస్తే 15 శాతం తగ్గిందని ఒక నివేదిక పేర్కొంది. 1,100కు పైగా విద్యాసంస్థల సమాచారంతో కామన్ యాప్ విడుదల చేసిన నివేదిక ప్రకారం రానున్న 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాల కోసం దరఖాస్తుల సంఖ్య మొత్తంగా పెరిగినప్పటికీ మార్చి 1 నాటికి అంతర్జాతీయ దరఖాస్తుదారుల సంఖ్య మాత్రం 10 శాతం తగ్గింది. ఇది రికార్డు స్థాయిలోనే అత్యంత భారీ తగ్గుదల కావడం గమనార్హం.