వాషింగ్టన్: అమెరికాలో పని చేసేందుకు హెచ్-4 వీసాదారులకు ఆటోమేటిక్‌గా హక్కు కల్పించే బిల్లును ఇద్దరు చట్ట సభ్యులు సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే భారతీయులతోపాటు వేలాది విదేశీ జీవిత భాగస్వామ్యులకు లబ్ధి చేకూరుతుంది. అలాగే అమెరికా వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్న కార్మికులు, సిబ్బంది కొరతను ఇది తీరుస్తుంది. అమెరికాలో ఉద్యోగం కోసం హెచ్-1బీ, హెచ్-2ఏ, హెచ్-2బీ, హెచ్-3 వీసాలు కలిగిన వారి జీవిత భాగస్వామ్యులు, పిల్లలకు హెచ్-4 వీసాలను జారీ చేస్తారు. కాగా, చాలా మంది హెచ్-4 వీసాదారులు తమ తమ రంగాల్లో నైపుణ్యం ఉండి, కుటుంబానికి అండగా ఉండేవారే. అయితే వారు అమెరికాలో నేరుగా ఉద్యోగాలు చేసేందుకు వీలు లేదు.
ఈ నేపథ్యంలో ఈ అడ్డంకిని తొలగించేందుకు కాంగ్రెస్ మహిళా సభ్యులు కరోలిన్ బోర్డోక్స్, మరియా ఎల్విరా సలాజర్, హెచ్-4 వర్క్ అథరైజేషన్ యాక్ట్‌ను ప్రతినిధుల సభలో గురువారం ప్రవేశపెట్టారు. హెచ్-1బీ వీసా కలిగిన జీవిత భాగస్వాములు హెచ్-4 వీసా పొందిన తర్వాత అమెరికాలో ఉద్యోగం చేసే హక్కును ఆటోమేటిక్‌గా పొందేలా చట్టంలో సవరణ చేయాలని కోరారు. ఈ వీసాలు ఉన్న వారు అమెరికాలో ఉద్యోగం కోసం ఫార్మ్ ఐ-765 ద్వారా దరఖాస్తు చేయాల్సిన అవసరాన్ని ఈ బిల్లు నివారిస్తుందని పేర్కొన్నారు.