టెహ్రాన్, మే 28 : ఇరాన్‌పై అమెరికా మళ్లీ భీకర దాడులకు దిగింది. ఇరాన్ డ్రోన్లను కూల్చివేసిన అనంతరం అమెరికా దళాలు బుధవారం ఇరాన్ సైనిక స్థావరంపై తాజాగా రక్షణాత్మక దాడులు జరిపినట్లు అమెరికా అధికారులు తెలిపారు. హొర్ముజ్ జలసంధి చుట్టూ ముప్పుగా పరిణమించిన ఇరాన్‌కు చెందిన నాలుగు డ్రోన్లను అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు కూల్చివేసినట్లు అమెరికా అధికారులు అనధికారికంగా తెలిపారు. ఐదవ డ్రోన్‌ను పంపడానికి సిద్ధంగా ఉన్న బందర్ అబ్బాస్‌లోని ఇరాన్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌పై కూడా అమెరికా దళాలు దాడులు జరిపినట్లు వారు చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతటా అశాంతిని రేకెత్తించిన దాదాపు మూడు నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధాన్ని ముగించడానికి నవంబర్‌లో జరగబోయే మధ్యంతర ఎన్నికలు తనను ఒప్పందం కోసం తొందరపెట్టలేదని, ఇరాన్ పూర్తి నిస్పృహతో చర్చలు జరుపుతోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసిన తర్వాత ఈ దాడులు ప్రారంభమయ్యాయి.
క్యాబినెట్ సమావేశం మొదలు కావడానికి ముందు ఆయన మాట్లాడుతూ ఈ వారాంతంలో ఇరాన్‌తో ఒప్పందం కుదురుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అంతేగాక తన ప్రభుత్వం, ఇరాన్ ఒక ఒప్పందాన్ని చాలా వరకు కుదుర్చుకున్నాయని కూడా ట్రంప్ ప్రకటించినప్పటికీ చర్చలు మాత్రం ఇంకా అనిశ్చితంగానే ఉన్నాయి. హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచి, విజయం ప్రకటించుకోవడానికి ఇరాన్ అణు సామర్థ్యం గణనీయంగా క్షీణించిందని చూపించేందుకు తనకు ఒక విశ్వసనీయమైన వాదనను అందించే పరిష్కారం కోసం ట్రంప్ ఎదురుచూస్తున్నారు. తద్వారా రిపబ్లికన్లకు రాజకీయంగా మేలేచేయని ఈ యుద్ధాన్ని ముగించాలని ఆయన భావిస్తున్నారు. మరోవైపు అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్‌లోని అమెరికా బేస్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. తమ గగనతలంపైకి క్షిపణులు, డ్రోన్లు దూసుకువచ్చాయని కువైట్ పేర్కొన్నది. అయితే వాటిని సమర్థంగా అడ్డుకున్నట్టు తెలిపింది.
గత మూడు నెలలుగా కొనసాగుతున్న పశ్చిమాసియా సంక్షోభానికి తెరదించేందుకు అమెరికా-ఇరాన్ ఒక ప్రాథమిక ఒప్పందానికి చేరుకున్నట్టు సమాచారం. ఇరాన్ అణు కార్యక్రమాల నిలిపివేత, హొర్ముజ్ జలసంధిని తెరవడం తదితర అంశాలతో కాల్పుల విరమణను పొడిగించడానికి వీరు ప్రాథమికంగా ఒక ఒప్పందానికి వచ్చారని, అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారని తెలిసింది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆక్సియోస్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఈ వారం మొదట్లోనే ఇరు వర్గాలు 60 రోజుల అవగాహన ఒప్పంద ముసాయిదాకు అంగీకరించాయి. ఇది కనుక అధికారికంగా ఆమోదం పొందితే గత మూడు నెలల పశ్చిమాసియా సంక్షోభం ముగింపు దశకు ప్రధాన అడుగుగా భావించవచ్చునని నిపుణులు అంటున్నారు. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య మళ్లీ మొదలైన మిలిటరీ కవ్వింపులు తీవ్రమై పరిస్థితి చేయి దాటిపోకముందే శాంతి ఒప్పందం జరగాల్సిన ఆవశ్యకత ఉందని వారు పేర్కొంటున్నారు.
ఈ తాత్కాలిక ఒప్పంద ముసాయిదా ప్రతిపాదనను ట్రంప్ ముందు ఉంచామని, అయితే ఆయన ఇంకా అంగీకారం తెలపలేదని వాషింగ్టన్ అధికారులు తెలిపారు. దీనిపై ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవడానికి తనకు రెండు రోజుల సమయం కావాలని ట్రంప్ మధ్యవర్తులకు తెలిపినట్టు ఆక్సియోస్ వెల్లడించింది. అయితే ఈ ముసాయిదాలోని అంశాల గురించి శ్వేత సౌధం అధికారులేమీ వెల్లడించడం లేదు. ఇరాన్ ప్రధాన డిమాండ్ అయిన ఆ దేశంపై విధించిన ఆంక్షల ఎత్తివేత గురించి తాము ప్రస్తుతం ఎలాంటి చర్చలు జరప లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. కాగా, 60 రోజుల శాంతి ఒప్పంద చర్చల్లో ప్రధానంగా హొర్ముజ్ జలసంధి పునరుద్ధరణపై దృష్టి కేంద్రీకరించారని, తర్వాత శాంతి ఒప్పందం కొనసాగుతున్నప్పుడు మిగతా విషయాలపై చర్చిస్తారని కొందరు ఉన్నతాధికారులు వెల్లడించారు.