న్యూయార్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు మొదలయ్యాయి. ప్రస్తుతం ముందస్తు ఓటింగ్ జరుగుతోంది. నవంబర్ 5వ తేదీన దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు .. బిలియనీర్ ఎలన్ మస్క్(Elon Musk) మద్దతు తెలిపారు. ఇక మస్క్‌కు చెందిన ప్రచార సంస్థ అమెరికా ప్యాక్.. ఓటర్లకు ప్రైజ్‌మనీ ఆఫర్ ఇస్తున్నది. ఈ నేపథ్యంలో అమెరికా న్యాయశాఖ వార్నింగ్ ఇచ్చింది. ఓటర్లకు ప్రైజ్‌మనీ ఇవ్వడం అంటే ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని న్యాయశాఖ తన లేఖలో పేర్కొన్నది.
మస్క్ ప్రకటించిన పది లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ ప్రకారం.. ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో ఓటర్లు ఓ పిటీషన్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఎన్నికల తేదీ వరకు ఓ విజేతను ప్రకటిస్తారు. ర్యాండమ్‌గా ఓ వ్యక్తిని ఎంపిక చేసి, అతని మిలియన్ డాలర్ ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. పెన్సిల్వేనియాలో అక్టోబర్ 19వ తేదీన టౌన్హాల్లో జరిగిన ఈవెంట్లో ఓ మహిళ ఓటర్‌కు లాటరీ తరహాలోని జంబో చెక్‌ను అందజేశారు. పిటీషన్‌పై సంతకం చేయడానికి ఆ పార్టీతో సంబంధం లేదని, ఓటు వేయకున్నా పిటీషన్‌పై సంతకం చేయవచ్చు అని ఇటీవల మస్క్ అన్నారు.
జార్జియా, నెవడా, ఆరిజోనా, మిచిగన్, విస్కిన్సన్, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో అమెరికా ప్యాక్ సంస్థ ఓటర్ల నుంచి పిటీషన్లను స్వీకరిస్తున్నది. పిటీషన్‌పై సంతకం చేసి మరో ఓటర్ను రిఫర్ చేస్తే వారికి 47 డాలర్లు ఇవ్వనున్నారు. పెన్సిల్వేనియాలో ఒక సంతకానికి 100 డాలర్లు ఇస్తున్నారు. పిటీషన్‌పై సంతకం చేయడం ద్వారా అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్, సెకండ్ సవరణలకు మద్దతు ఇస్తున్నట్లు అవుతుందని అమెరికా ప్యాక్ సంస్థ చెప్పింది.