Pegasus | న్యూయార్క్: వాట్సాప్ వినియోగదారుల డివైజ్‌లలో అక్రమంగా పెగాసస్ స్పైవేర్‌ను జొప్పించిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థపై మెటా దాఖలు చేసిన కేసులో అమెరికా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ వినియోగదారుల డివైజ్‌ల హ్యాకింగ్‌కు ఎన్ఎస్ఓ గ్రూప్‌దే బాధ్యత అని స్పష్టం చేసింది. వాట్సాప్‌లోని బగ్‌ను ఉపయోగించుకొని అక్రమంగా స్పైవేర్‌ను జొప్పించిందని ఎన్ఎస్ఓ గ్రూప్‌పై మెటా సంస్థ 2019లో అమెరికా కోర్టును ఆశ్రయించింది.
ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఫిల్లిస్ హమిల్టన్.. 1400 మంది వాట్సాప్ వినియోగదారుల డివైజ్‌లు లక్ష్యంగా మారడానికి పెగాసస్ స్పైవేర్ తయారుచేసిన ఎన్ఎస్ఓ గ్రూప్‌దే బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ సంస్థ సంబంధిత చట్టాల్లోని నిబంధనలను ఉల్లంఘించిందని పేర్కొన్నారు. కోర్ట్ వ్యాఖ్యల పట్ల మెటా సంస్థ హర్షం వ్యక్తం చేయగా, ఎన్ఎస్ఓ గ్రూప్ స్పందించలేదు.
పెగాసస్ స్పైవేర్ ఉదంతం భారత్‌లోని ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. 300 భారతీయ మొబైల్ నెంబర్లపై పెగాసస్‌ను వినియోగించారని 2021లో వార్తలు వచ్చాయి. ఇందులో అప్పటి ఇద్దరు కేంద్రమంత్రులు, ముగ్గురు ప్రతిపక్ష పార్టీల నేతలు, జర్నలిస్టులు, వ్యాపారులు ఉన్నట్టు ఆరోపణలు సంచలనం రేపాయి. అయితే, ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని అప్పటి ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో ప్రకటించారు. ఇప్పుడు అమెరికా కోర్టు తీర్పు నేపథ్యంలో మరోసారి దేశంలో పెగాసస్ స్పై వేర్ చర్చనీయాంశంగా మారింది.