న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో భారతీయ విద్యార్థులకు అమెరికా జారీచేసే వీసాల సంఖ్య భారీ స్థాయిలో తగ్గిపోయింది. 2024 సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో భారతీయ విద్యార్థులకు జారీ చేసిన ఎఫ్-1 స్టూడెంట్ వీసాలలో 38 శాతం తగ్గుదల ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఇదే కాలంలో కొవిడ్ తర్వాత ఇంత భారీ స్థాయిలో వీసాల తగ్గుదల కనిపించడం ఇదే మొదటిసారి.
కొవిడ్ తర్వాత అమెరికాలోని అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో అంతర్జాతీయ విద్యార్థుల చేరికలో పెరుగుదల కనిపించింది. ఇతర దేశాల స్టూడెంట్ వీసాల జారీలో స్వల్పంగా తగ్గుదల ఉండగా భారతీయ విద్యార్థులకు జారీ చేసిన వీసాల సంఖ్యలో మాత్రం గణనీయమైన పెరుగుదల ఉంది. ఇప్పటికే కఠినంగా ఉన్న అమెరికా వీసా నిబంధనలు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో మరింత కఠినంగా మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
కొవిడ్ తర్వాత మొట్టమొదటిసారి భారతీయ విద్యార్థుల ఎఫ్-1 వీసాలలో భారీ తగ్గుదల ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024 జనవరి, సెప్టెంబర్ మధ్య కేవలం 64,008 వీసాలు మాత్రమే జారీ అయ్యాయి. 2023లో ఇదే కాలంలో 1,03,495 వీసాలు జారీ కాగా 2021లో 65,235 వీసాలు, 2022లో 93,181వీసాలు జారీ అయ్యాయి. కొవిడ్ ప్రబలిన 2020 సంవత్సరం తొలి 9 నెలల్లో 6,646 ఎఫ్-1 వీసాలు మాత్రమే జారీ అయ్యాయి. ఇతర దేశస్తులతో పోలిస్తే చైనా విద్యార్థులకు అమెరికా జారీ చేసే ఎఫ్-1 వీసాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.
అమెరికా సంస్థలలో విద్యాభ్యాసం చేసే విద్యార్థుల కోసం అమెరికా విదేశాంగ శాఖ ఎఫ్-1 వీసాలను జారీ చేస్తుంది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో కొత్త విద్యార్థి వీసాల జారీలో భారత్ చైనాను మించిపోయింది. ఓపెన్ డోర్స్ 2024 నివేదిక ప్రకారం అమెరికా యూనివర్సిటీలలో చదువుకుంటున్న భారతీ విద్యార్థుల సంఖ్య 2023-24 విద్యా సంవత్సరంలో 3.31 లక్షలు ఉంది. అమెరికాలోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థి జనాభాలో ఇది 29.4 శాతంగా ఉండడం విశేషం.