వాషింగ్టన్: ఇరాన్‌తో జరిగే రెండో విడత చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా ప్రతినిధులు(US Envoys ) పాకిస్థాన్ వెళ్లనున్నారు. స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ దౌత్యవేత్తలుగా వ్యవహరించనున్నారు. అయితే ఇరానీ దౌత్యవేత్తలతో ఆ ఇద్దరూ నేరుగా చర్చలు నిర్వహిస్తారని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లివియేట్ తెలిపారు. విట్కాఫ్, కుష్నర్ శనివారం ఇస్లామాబాద్ వెళ్తారన్నారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్న చర్చల్లో ఇరానీ నేతలతో తమ దౌత్యవేత్తలు నేరుగా సంప్రదింపులు చేస్తారని ఆమె అన్నారు. వ్యక్తిగత సంప్రదింపులు అవసరమని ఇరానీలు అడిగినట్లు వైట్‌హౌజ్ తెలిపింది.
అయితే ఆ చర్చలు ఓ కొలిక్కి వస్తాయని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. అమెరికా దౌత్యవేత్తలు ఎవరితో కలుస్తారన్న విషయాన్ని వైట్‌హౌజ్ వెల్లడించలేదు. కానీ ఇరానీ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగాచి ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకున్నారు. అమెరికా నేతలతో మీటింగ్ ఉండబోదని ఇరానీ విదేశాంగ శాఖ ప్రతినిధి తన ఎక్స్ అకౌంట్లో తెలిపారు. టెహ్రాన్ తమ అభిప్రాయాలను పాకిస్థాన్ అధికారులకు చేరవేస్తుందని, మధ్యవర్తులు ఈ విషయాన్ని అమెరికాకు చెప్పనున్నట్లు వెల్లడించారు. ఒకవేళ చర్చలు ప్రగతిపథంలో సాగితే, అప్పుడు ఆ మీటింగ్‌కు వెళ్లేందుకు జేడీ వాన్స్ స్టాండ్బైలో ఉంటారని వైట్‌హౌజ్ పేర్కొన్నది.