US Election | వాషింగ్టన్ : అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలిగా కమలహారిస్ చరిత్ర సృష్టిస్తారా? మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికై శ్వేతసౌధంలో అడుగిడాలన్న డొనాల్డ్ ట్రంప్ ఆశలు ఫలిస్తాయా? కమల, ట్రంప్ భవితవ్యంపై మరికొద్ది గంటల్లో అమెరికా ఓటర్లు తీర్పు చెప్పనున్నారు. అగ్రరాజ్య చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి పోటీ నెలకొంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలాహారిస్.. నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నారు. స్థానిక నిబంధనల ప్రకారం మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో పోలింగ్ ప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటల నుంచి 11 గంటల మధ్యలో పోలింగ్ ముగుస్తుంది. ఈ సమయాలు ఆయా కౌంటీలు, రాష్ర్టాలనుబట్టి వేర్వేరుగా ఉంటాయి. పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితాల వెల్లడి ప్రారంభమవుతుంది. ఈ నెల 6 నుంచి డిసెంబరు 11 వరకు ఎన్నికల ఫలితాలను కౌంటీలు, రాష్ర్టాలు ధ్రువీకరిస్తాయి.
2025 జనవరి 3న కొత్తగా ఎన్నికైన కంగ్రెషనల్ రిప్రజెంటేటివ్స్, సెనేటర్స్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. 2025 జనవరి 6న ఎలక్టొరల్ కాలేజ్ ఓట్లను కాంగ్రెస్ లెక్కిస్తుంది. దీని కోసం కాంగ్రెస్ ప్రత్యేక సంయుక్త సమావేశం జరుగుతుంది. 270 లేదా అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని దేశాధ్యక్షునిగా ప్రకటిస్తారు. దేశ ఉపాధ్యక్షునికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. 2025 జనవరి 20న మధ్యాహ్నం దేశాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు.
పోలింగ్ ప్రారంభమవడానికి కొద్ది గంటల ముందు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020లో తాను వైట్ హౌస్‌ను విడిచి వెళ్లకుండా ఉండవలసిందని అన్నారు. తన పదవీ కాలంలో ఎంతో గొప్పగా పని చేశానని నిజాయితీగా చెప్తున్నానని తెలిపారు. ఆ ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలిచిన సంగతి తెలిసిందే.