న్యూయార్క్: లంచం కేసులో తనతో పాటు మరో ఏడుగురిపై నమోదైన క్రిమినల్ అభియోగాలను ఉపసంహరించుకోవాలని అమెరికా ప్రభుత్వానికి అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ చేసుకున్న అభ్యర్థనపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తాజాగా అమెరికా కోర్టు ‘ఎవరైనా ఏదైనా హామీ ఇచ్చారా? ఆఫర్ చేశారా? లేదా క్విడ్ప్రోకో చేసుకున్నారా? అనే విషయాలను వెల్లడించాలని అదానీని ఆదేశించింది. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నికోలస్ జీ గరాఫిస్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
అదానీపై ఉన్న ఆరోపణలను ఎందుకు ఉపసంహరించుకోవాలనుకుంటున్నారో వివరించాలని గతంలో కోర్టు ఆదేశించగా, ప్రిన్సిపల్ అసోసియేట్ డిప్యూటీ అటార్నీ జనరల్ ఆర్ ట్రెంట్ మెక్కాటర్ కోర్టుకు సమాధాన మిచ్చారు. ఈ నిర్ణయం వెనుక తానే తుది, ఏకైక నిర్ణేతను అని పేర్కొన్న మెక్కాటర్ అమెరికాలో పెట్టుబడులు పెడతామని అదానీ ఇచ్చిన హామీ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారనే నివేదికలను తోసిపుచ్చారు.