లాస్ఏంజెలెస్: అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి లాస్ ఏంజెలెస్ జూరీ భారీ జరిమానా విధించింది. వారు తయారు చేసిన బేబీ పౌడర్ ఉత్పత్తుల కారణంగా క్యాన్సర్ వస్తున్నట్టు నిర్ధారణ అయ్యిందని, అది వాడి మెసోథెలియోమా వ్యాధికి గురై మరణించిన ఒక మహిళ కుటుంబానికి 966 మిలియన్ డాలర్లు (8,577 కోట్ల రూపాయలు) పరిహారంగా చెల్లించాలని తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాకు చెందని మే మూర్ అనే మహిళ 2021లో తన 88వ ఏట మరణించింది.
అయితే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ టాల్క్ బేబీ పౌడర్ ఉత్పత్తులను మూర్ వాడిందని, దానిలో ఉన్న ఆస్బెస్టాస్ ఫైబర్ కారణంగా ఆమె అరుదైన క్యాన్సర్కు గురైందని ఆమె కుటుంబ సభ్యులు అదే ఏడాది దావా వేశారు. తమ కంపెనీ ఉత్పత్తులు పూర్తి సురక్షితమైని, అందులో ఎలాంటి ఆస్బెస్టాస్ లేదని, ఎలాంటి క్యాన్సర్ కారకాలు లేవని కంపెనీ కోర్టులో వాదించింది. దీనితో విభేదించిన జూరీ.. బాధితురాలి కుటుంబానికి 966 మిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది. కాగా, ఈ తీర్పు దారుణం, రాజ్యాంగ విరుద్ధమని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ హాస్ పేర్కొన్నారు. దీనిపై తాము ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు తెలిపారు.