వాషింగ్టన్: చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినట్లు ఆరోపించిన నల్లజాతి బాలుడిపై అమెరికా పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. బాలుడి చేతులు వెనక్కి విరిచి పట్టుకుని చిత్రహింసలకు పాల్పడ్డారు. దీంతో ఆ చిన్నారి బాధతో విలవిలలాడిపోయాడు. న్యూయార్క్‌లోని సైరక్యూస్లో ఈ ఘటన జరిగింది. స్థానిక పోలీసులు ఒక నల్లజాతికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడిపై తమ జులుం ప్రదర్శించారు. చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినట్లు ఆరోపించిన పోలీసులు ఆ బాలుడి రెండు చేతులు వెనక్కి మెలితిప్పి పట్టుకున్నారు. ఆ చిన్నారిని అదుపులోకి తీసుకుని పోలీస్ వ్యాన్ వద్దకు తీసుకెళ్లారు. దీంతో ఆ బాలుడు బాధతో ఏడ్వసాగాడు.
గమనించిన ఒక వ్యక్తి ఏం చేస్తున్నారంటూ ఆ పోలీసులను అడిగాడు. ‘నేను ఏం చేస్తున్నానో ఊహించు?’ అని ఒక పోలీస్ ఎదురు ప్రశ్నించాడు. ఆ బాలుడు చిప్స్ ప్యాకెట్ దొంగిలించాడని మరో పోలీస్ అధికారి చెప్పాడు. అయితే దానికి తాను డబ్బులు చెల్లిస్తానంటూ ఆ వ్యక్తి పోలీసులతో అన్నాడు. పట్టించుకోని పోలీసులు బాలుడ్ని తమ వాహనంలో ఎక్కించుకుని వెళ్లిపోయారు.
మరోవైపు పోలీసులతో మాట్లాడిన వ్యక్తి రికార్డు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక కరుడుగట్టిన నేరస్తుడి మాదిరిగా ఎనిమిదేళ్ల బాలుడి చేతులు వెనక్కి విరిచి పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై స్థానిక మీడియా, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లజాతి పోలీసుల తీరుపై మండిపడ్డారు. పోలీసులు జాతి వివక్ష చూపుతున్నారని, నల్లజాతీయులపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఘటన తన హృదయాన్ని ద్రవింపజేసిందని న్యూయార్క్ గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, సైరక్యూస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఘటనపై వివరణ ఇచ్చింది. పోలీస్ అధికారుల చర్యలు, వారి బాడీ కెమెరాలోని ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు చెప్పింది. చోరీకి పాల్పడిన బాలుడి చేతులకు బేడీలు వేయలేదని పేర్కొంది. ఆ బాలుడ్ని పోలీస్ వాహనంలో ఇంటికి తరలించి తండ్రికి అప్పగించామని, ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా, గతంలో కూడా నల్లజాతి వ్యక్తులను పోలీసులు చిత్రహింసలకు గురి చేసి ప్రాణాలు తీసిన ఘటనలు అమెరికాలో సంచలనం రేపాయి.
Syracuse (NY) police officers detained an 8-YEAR-OLD for allegedly stealing a bag of Doritos! Rather than talking to him or handling this incident in a different way, officers chose to escalate this incident and detain an obviously terrified young boy! How traumatizing is this?! pic.twitter.com/Nx8iD7gcdY
— Ben Crump (@AttorneyCrump) April 20, 2022