US B-52 Bombers | ప్రపంచంలోనే భారీ చమురు నిల్వలున్న దేశంగా ప్రసిద్ధి చెందిన వెనెజువెలా (Venezuela) ఆక్రమణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెగబడుతున్నారు. ఎన్నో ఏండ్లుగా ఆ దేశంపై కన్నేసిన ట్రంప్.. డ్రగ్స్ ముఠాల నెపంతో ఆ దేశాన్ని కబళించడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అందులో భాగంగానే వెనెజువెలా చుట్టూ కరేబియన్ సముద్రంలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరిస్తున్నారు. ఇప్పటికే భారీగా యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు, జలాంతర్గములు, అత్యాధునిక ఫైటర్ జెట్లను అగ్రరాజ్యం మోహరించింది. తాజాగా రెండు అమెరికా B-52 బాంబర్లు (US B-52 Bombers) కరేబియన్ సముద్రం (Caribbean Sea)లో వెనెజువెలా తీరం వెంబడి ప్రయాణించాయి.
ఈ రెండు బాంబర్లు వెనెజువెలా తీరానికి సమాంతరంగా ప్రయాణించి.. ఆ తర్వాత రాజధాని కరాకస్ (Caracas)కు ఈశాన్య దిశలో కాసేపు చక్కర్లు కొట్టాయి. అనంతరం తిరిగి తీరం వెంబడి ప్రయాణిస్తూ ఉత్తర దిశగా సముద్రంలోకి వెళ్లిపోయినట్లు విమాన కదలికలను ట్రాక్ చేసే వెబ్సైట్ ‘ఫ్లైట్ రాడార్ 24’ ద్వారా తెలిసింది. అక్టోబర్ మధ్య నుంచి అమెరికా సైనిక విమానాలు వెనెజువెలా సమీపంలో ప్రయాణించడం ఇది నాలుగోసారి. గతంలో ఓసారి B-52, రెండుసార్లు B-1B బాంబర్లు ఇలాంటి విన్యాసాలు చేశాయి.
మరోవైపు ఎనిమిది యుద్ధ నౌకలు, అణ్వాయుధ సామర్థ్యమున్న ఒక జలాంతర్గామిని అమెరికా వెనెజువెలాకు అత్యంత సమీపంగా మోహరించింది. ఎఫ్-35 యుద్ధ విమానాలతో దాడికి పాల్పడే ఇతర వైమానిక యుద్ధ సామగ్రితో యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ యుద్ధనౌక ఏ క్షణంలోనైనా విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నది. వీటితోపాటు 4,500 మంది సైనికులు, 2,300 మంది మెరైన్లు కూడా సిద్ధంగా ఉన్నారు. 1994లో హైతీ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకున్న అమెరికా.. అప్పుడు కూడా ఇదే స్థాయిలో అక్కడ సైన్యాన్ని మోహరించడం చూస్తుంటే ప్రపంచంలో మరో యుద్ధం రావడం ఖాయంగా స్పష్టమవుతోంది.
వెనెజులా డ్రగ్స్ ముఠాల నుంచి తమ దేశాన్ని మాదకద్రవ్యాలు ముంచెత్తుతున్నాయంటూ ట్రంప్ ఆరోపిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ముఠాలతో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోకు సంబంధాలు ఉన్నాయని కూడా ఆయన ఆరోపించారు. ఆయనను పట్టించే సమాచారం ఇస్తే ఏకంగా రూ.430 కోట్ల బహుమతి ఇస్తామంటూ కూడా ప్రకటించారు. అయితే, అమెరికా యుద్ధ దుందుడుకు చర్యలను వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో తప్పుబట్టారు. తమపై యుద్ధానికి దిగితే తాము కూడా సైనిక దాడితో సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ‘మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్.. జాగ్రత్తగా ఉండండి.. రుబియో మీ చేతులను రక్తంతో తడపాలనుకుంటున్నారు’ అని ఏడాది తర్వాత తొలిసారిగా కార్కస్లో జరిగిన అరుదైన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. వెనెజులా పౌరులు పోరాట యోధులని, ఎలాంటి దాడినైనా ఎదుర్కొంటారని ఆయన అన్నారు.
2021 నాటికి వెనెజువెలా దేశంలో 48 వేల మిలియన్ టన్నుల చమురును గుర్తించారు. ప్రపంచ చమురులో 17 శాతానికి సమానం. వెనెజువెలాను ఆక్రమించుకోవాలన్న ఆశ ట్రంప్‌కు ఎప్పటి నుంచో ఉంది. 2017లోనే ఆయన వెనెజువెలాపై మనం యుద్ధం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. 2023లో సైతం వెనెజువెలా కుప్పకూలడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. ‘మేము దానిని ఆక్రమించుకునే వాళ్లం. దాని చమురు మొత్తాన్ని తీసుకునే వాళ్లం’ అని అన్నారు.
Also Read..
Elon Musk | జీతం ట్రిలియన్ డాలర్లు.. ఆనందం పట్టలేక రోబోతో కలిసి డ్యాన్స్ చేసిన మస్క్.. VIDEO
Donald Trump | మోదీ కోరుకుంటున్నారు.. త్వరలోనే భారత్‌లో పర్యటిస్తా: డొనాల్డ్ ట్రంప్