వాషింగ్టన్, జూన్ 22: ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి ఉపయోగించిన యూఎస్ బీ-2 స్టెల్త్ బాంబర్లు నిరాఘాటంగా 37 గంటలపాటు ప్రయాణించాయని ఓ అమెరికా అధికారి వెల్లడించారు. మార్గమధ్యంలో పలుమార్లు ఆకాశంలోనే వీటిలో ఇంధనం నింపారని చెప్పారు. ఫోర్డో, నతాంజ్ అణుశుద్ధి కేంద్రాలపై దాడికి బంకర్ బస్టర్ బాంబులను వినియోగించారు. అమెరికాలోని ముస్సోరిలో బయలుదేరిన ఈ బాంబర్లు 37 గంటల అనంతరం నిర్దేశిత లక్ష్యానికి చేరుకున్నాయి.
మొత్తం ఏడు బాంబర్లు ఫోర్డో, నతాంజ్ అణుశుద్ధి కేంద్రాలపై 14 బంకర్ బస్టర్లను జారవిడిచాయి. ఈ బాంబర్లు మోసుకొచ్చిన ఒక్కో జేబీయూ-57 బంకర్ బస్టర్ బాంబు బరువు 13,600 కిలోలు. దాదాపు 20 అడుగుల పొడవు ఉండే ఈ బాంబులు పర్వతాలను సైతం చీల్చుకుంటూ 60 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోయి పేలతాయి. ఒక్కో బాంబు ఖరీదు 20 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఫోర్డో అణుశుద్ధి కేంద్రాన్ని ఇరాన్ ఓ పర్వతం కింద సుమారు 300 అడుగుల లోతున నిర్మించింది. అక్కడి నుంచి మరింత లోతులో యురేనియంను శుద్ధిచేసే కేంద్రం ఉన్నట్టు అంచనా.