(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందంతో తాత్కాలికంగా ఉద్రిక్తతలు చల్లారినప్పటికీ, యుద్ధం మిగిల్చిన గాయాలు మాత్రం యావత్తు ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. 40 రోజులపాటు సాగిన ఈ యుద్ధంతో ఏం సాధించినట్టు? దాడులు, ప్రతిదాడులతో చివరకు ఏం మిగిలింది? అనే చర్చ ఇప్పుడు అంతటా వ్యక్తమవుతున్నది.
అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఒక్క ఇరాన్‌లోనే 3 వేల మందికి పైగా పౌరులు, సైనికులు మరణించినట్టు రాయిటర్స్ తెలిపింది. అటు అమెరికా వైపున 13 మంది సైనికులు మరణించగా, ఇజ్రాయెల్‌లో 40 మందికి పైగా మరణించినట్టు తెలుస్తున్నది. లెబనాన్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో మరో 1,500 మందికి పైగా మృత్యువాతపడ్డట్టు సమాచారం. మొత్తంగా పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో 7 వేల మంది వరకూ ప్రాణాలు కోల్పోయినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తున్నది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఒక్క ఇరాన్‌లోనే 4 వేలకు పైగా భవనాలు నేలమట్టం కాగా, వివిధ ప్రాంతాల్లోని మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. అటు ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్, గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలు కూడా నాశనమయ్యాయి. వెరసి 500 బిలియన్ డాలర్ల వరకూ నష్టం వాటిల్లినట్టు అంచనా.
ఇరాన్‌పై తేలిగ్గా పైచేయి సాధించాలనుకొన్న అమెరికాకు ఈ యుద్ధం పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికా చరిత్రలో ఎన్నడూ చూడనంతటి నష్టాన్ని ఆ దేశం మూటగట్టుకొన్నది. ఇరాన్‌పై దాడులకు రోజుకు కనీసం 2 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తూ.. మొత్తంగా 40 రోజులకు 80-100 బిలియన్ డాలర్లను ట్రంప్ సర్కారు వెచ్చించాల్సి వచ్చింది. అంతేకాదు, అమెరికాకు చెందిన అడ్వాన్స్డ్ స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఎఫ్-35, ఎఫ్-18, ఎఫ్-16ను ఇరాన్ నేలకూల్చింది. చవకైన డ్రోన్లతో అడ్వాన్స్డ్ యూఎస్ ఎస్‌యూవీలను పేల్చేసింది. గల్ఫ్ దేశాల్లో బిలియన్ల డాలర్ల విలువజేసే అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక వసతులను నాశనం చేసింది. మొత్తంగా ఈ యుద్ధం ట్రంప్ పరపతిని మరింత దిగజార్చింది.
ప్రపంచ చమురులో దాదాపు 20 శాతం రవాణా జరిగే హొర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు గతంలో ఇరాన్ ఎలాంటి రుసుము వసూలు చేసేదికాదు. అయితే, యుద్ధం కారణంగా రక్షణ, పాలన, పౌర మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వాటిని పునర్నిర్మించుకోవడానికి టోల్ వసూలు చేయనున్నట్టు ఇరాన్ ప్రకటించింది. రాయిటర్స్ కథనం ప్రకారం ఓడ రకం, దానిలోని సరుకు, ఇతర పరిస్థితులను బట్టి టోల్ మారుతుందని తెలుస్తున్నది. మొత్తంగా ఈ యుద్ధంతో గతంలో లేని రవాణా ఫీజు ప్రపంచ దేశాల నెత్తిన పడ్డట్టయ్యింది.
యుద్ధం కారణంగా ఇరాన్ అధినాయకత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. తొలి రోజే సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతిచెందగా, ఆ తర్వాత ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ హెడ్ అలీ లారీజానీ, చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మౌసావీ, సీనియర్ ఐఆర్జీసీ కమాండర్ పాక్‌పౌర్, రక్షణ మంత్రి అజీజ్ నాజిర్ జాదేహ్తో పాటు ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ చీఫ్‌లతో కలిపి మొత్తం 40 మంది సీనియర్ అధికారులు మరో 70 మంది హైర్యాంక్ లీడర్లు మరణించినట్టు సమాచారం.
సంపన్నుల పాలిట భూలోక స్వర్గాలుగా, ప్రపంచంలోనే అత్యంత భద్రమైన దేశాలుగా గొప్పగా చెప్పుకొనే గల్ఫ్ దేశాలకు ఈ యుద్ధం పంటికింద రాయిలా మారింది. అంతేకాదు ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా సాయం అంతంత మాత్రమేనని రుజువు చేసింది. ఇరాన్ దాడులతో ఈ దేశాలు ఆర్థికంగా బాగా నష్టపోయాయి. భద్రతను దృష్టిలో ఉంచుకొని పలువురు సంపన్నులు గల్ఫ్ దేశాల్లో పెట్టుబడులపై పునరాలోచనలో పడ్డారు.
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలనూ వణికించింది. హొర్ముజ్ జలసంధిని మూసివేయడంతో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ద్రవ్యోల్బణం అదుపుతప్పింది. ఆహార సంక్షోభం వాటిల్లే పరిస్థితి దాపురించింది. వాణిజ్య, రవాణాకు అంతరాయం ఏర్పడింది. ముడి సరుకులకు కొరత వాటిల్లింది. వేలాది విమానయాన సేవలు రద్దయ్యాయి. పర్యాటకం కుదేలైంది. మొత్తంగా ప్రపంచ దేశాలకు 700 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.