Obsession Movie | హాలీవుడ్ హారర్-రొమాన్స్ థ్రిల్లర్ చిత్రం ‘అబ్సెషన్’ (Obsession) బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా అంచనాలను తలకిందులు చేస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఫోకస్ ఫీచర్స్’ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తూ.. తాజాగా ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 234 మిలియన్ల డాలర్ల (సుమారు రూ.2240 కోట్లకు పైగా) మైలురాయిని దాటేసింది.
కేవలం 100,000 డాలర్ల (సుమారు రూ. 9 కోట్లు) అత్యల్ప నిర్మాణ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, ఇప్పటివరకు ఏకంగా $234 మిలియన్లకు పైగా వసూలు చేసి 10000% కంటే ఎక్కువ లాభాలను ఆర్జించి ట్రేడ్ వర్గాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. యూట్యూబ్ క్రియేటర్ కర్రీ బార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 15న విడుదలైంది. ఒక మ్యూజిక్ స్టోర్ ఉద్యోగి తనకు నచ్చిన అమ్మాయి తనను ప్రాణంగా ప్రేమించాలనే కోరికను ఒక అతీత శక్తులున్న వస్తువు ద్వారా కోరుకోవడం, ఆ తర్వాత ఆ ప్రేమ కాస్తా భయంకరమైన ‘అబ్సెషన్’గా మారి ఎలాంటి ఘోరాలకు దారితీసిందనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. మైఖేల్ జాన్స్టన్, ఇండే నవరెట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇండియాలోనూ మంచి వసూళ్లను సాధిస్తోంది. ‘ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్’ వంటి ఎన్నో క్లాసిక్ హారర్ సినిమాల రికార్డులను తిరగరాస్తూ, భారీ వీఎఫ్ఎక్స్ ఆర్భాటాలు, అగ్ర నటీనటులు లేకపోయినా కేవలం బలమైన కథనం, అద్భుతమైన సౌండ్ డిజైనింగ్‌తో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించవచ్చని ‘అబ్సెషన్’ నిరూపించింది.