WHO on Omicron | ప్రపంచాన్ని శరవేగంగా చుట్టేస్తున్న కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ముఖ్యంగా ఆగ్నేయాసియాలోని ఏడు దేశాల ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. మాస్క్ ధరిస్తూ.. భౌతిక దూరం పాటించడంతోనే దీన్ని అడ్డుకోవచ్చునని డబ్ల్యూహెచ్‌వో ఈశాన్య ఆసియా డైరెక్టర్ పూనం ఖేత్రపాల్‌సింగ్ చెప్పారు. వైరస్ రిస్క్ ఎక్కువగా ఉన్న వారిని కాపాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
డెల్టా కంటే ప్రమాదకరమైన ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్‌పై పూర్తి సమాచారం మున్ముందు పూర్తి వివరాలు వెల్లడవుతాయని పూనంఖేత్రపాల్ సింగ్ చెప్పారు. దీంతో రీ ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉందని దక్షిణాఫ్రికా పేర్కొన్నందున ఒమిక్రాన్‌ను తక్కువ అంచనా వేయొద్దని స్పష్టం చేశారు.
వ్యక్తిగత సంరక్షణతోపాటు ఒకరినొకరు రక్షించుకోవాలని సూచించారు. అన్ని విభాగాల్లో వైద్యంతోపాటు ఐసీయూ బెడ్స్ కెపాసిటీ, ఆక్సిజన్ సరఫరా తదితర అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించి చర్యలు తీసుకోవాలన్నారు. మహమ్మారిని అంతం చేయడానికి వ్యాక్సినేషన్ ఎంతో ముఖ్యం అని పూనం ఖేత్రపాల్‌సింగ్ అన్నారు.