న్యూయార్క్: విదేశీ విద్యార్థుల వీసాలను అమెరికా(US Visas) తగ్గిస్తున్న విషయం తెలిసిందే. ఆ దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారి వీసాలను కూడా రద్దు చేసే ప్రణాళికలను అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా చైనీస్ విద్యార్థుల వీసాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. చైనీస్ కమ్యూనిస్టు పార్టీతో లింకున్న విద్యార్థుల వీసాలను, క్లిష్టమైన రంగాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల వీసాలను కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు అమెరికా మంత్రి వెల్లడించారు.
చైనా నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తుంటారు. అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనీయులు రెండో స్థానంలో ఉన్నారు. తొలి స్థానంలో భారతీయ విద్యార్థులు ఉన్నారు. 2023-2024 సంవత్సరంలో.. చైనా నుంచి 2 లక్షల 70 వేల మంది విద్యార్థులు అమెరికా చదువులకు వెళ్లారు. అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో నాలుగోవంతు చైనీయులే ఉన్నారు.
విదేశీ విద్యార్థులకు ఇంటర్వ్యూలను అమెరికా సర్కారు మంగళవారం రద్దు చేసింది. విద్యార్థుల వీసా మార్గదర్శకాలను కఠినతరం చేసింది. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్న వారిపై నిఘా పెంచేందుకు అమెరికా సర్కారు నిర్ణయించింది.