వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి విమాన సర్వీసులు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్య తలెత్తడంతో (Technology Issue) యునైటెడ్ ఎయిర్‌లైన్స్ (United Airlines) విమానయాన సంస్థ తన విమానాలను ఎక్కడికక్కడ నిలిపివేసింది. దీంతో సర్వీసులు ఆలస్యం కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో నిరీక్షిస్తున్నారు. సమస్యను పరిష్కరించేలోగా మరిన్ని సర్వీసులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో అధికారులను అప్రమత్తం చేసింది. యునైటెడ్ విమాన సర్వీసులు నిలిచిపోవడంతో డెన్వర్, న్యూయార్క్, హౌస్టన్, చికాగో ఎయిర్‌పోర్టులపై తీవ్ర ప్రభావం చూపనుందని హెచ్చరించింది. కాగా, ఇటీవలి కాలంలో సాంకేతిక లోపాలు అమెరికా విమానయాన రంగాన్ని తీవ్ర సమస్యగా మారాయి. గత నెలలో అలస్కా ఎయిర్‌లైన్స్‌లో ఐటీ సమస్య తలెత్తింది. దీంతో కొన్ని గంటల పాటు ఎయిర్‌పోర్టుల్లోనే తన విమానాలను నిలిపివేసింది. ఈ ఏడాది న్యూయార్క్ ప్రాంతంలోని విమానాశ్రయాల్లో ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లు ఒకటి కంటే అధికసార్లు నిలిచిపోయాయి. ఇక గత జనవరిలో వాషింగ్టన్‌లోని రీగన్ నేషనల్ విమానాశ్రయం సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న విమానం.. సైనిక హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. దీంతో పదుల సంఖ్యలో ప్రయాణికులు మరణించిన విషయం తెలిసిందే.