Nirmala Sitharaman | వాషింగ్టన్, అక్టోబర్ 25: ఉద్యోగాల కల్పన అనేది అత్యవసరమైన ప్రపంచ సమస్యగా మారుతున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆమె గురువారం ప్రపంచ బ్యాంకు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కొనసాగుతున్న ఆర్థిక ఎదురుగాలులు, సాంకేతికంగా సంభవిస్తున్న పెను మార్పులు జాబ్ మార్కెట్లో యువతకు అవసరమైన నైపుణ్యాలను మార్చేశాయని ఆమె పేర్కొన్నారు.
గతంలో హరిత ఉద్యోగాలు, ఏఐతో ఉద్యోగాల ప్రభావం వంటి అంశాలపై ప్రపంచ బ్యాంకు అనేక అధ్యయనాలు చేసిందని ఆమె గుర్తు చేశారు. కొత్తగా వస్తున్న ధోరణుల ప్రభావం ఉద్యోగ కల్పన, ఉద్యోగాల కోతపై ఎలా ఉంటుందో గుర్తించేందుకు మరింత సమగ్రంగా విశ్లేషించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు, సరైన నైపుణ్యాలు అందించేందుకు గానూ డిమాండ్ ఉన్న నైపుణ్యాలను గుర్తించేందుకు వివిధ దేశాలతో ప్రపంచ బ్యాంకు కలిసి పని చేయాలని ఆమె కోరారు.