కీవ్, మార్చి 16: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్‌ను తక్షణం నిలిపివేయాలని రష్యాను ఆదేశించింది. దాడులు నిలిపేయడంతో పాటు, ఉక్రెయిన్ భూభాగంపై రష్యా సేనలు గానీ, దానికి మద్దతు ఇచ్చే సాయుధ దళాలు గానీ ఎటువంటి తదుపరి ఆపరేషన్లు చేపట్టకుండా చూడాలని స్పష్టం చేసింది. సైనిక చర్య కారణంగా పౌరులు కూడా బాధితులుగా మారుతున్నారని, ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేసింది. రష్యాపై వేసిన కేసులో ఉక్రెయిన్ పూర్తి విజయం సాధించిందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఐసీజే ఇచ్చిన ఆదేశాలను రష్యా తక్షణం పాటించాలని, లేకుంటే మరింతగా ఏకాకి అవుతుందని అన్నారు.
బ్రెడ్ కోసం నిలబడితే కాల్చి చంపారు
కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. బుధవారం కూడా పుతిన్ సేనలు భీకర దాడులు కొనసాగించాయి. షెవ్చెంకో ప్రాంతంలోని రెండు బహుళ అంతస్తుల భవనాలపై బాంబులు వేశాయి. ఉక్రెయిన్ ఉత్తర ప్రాంతంలోని చెర్నిహివ్ పట్టణంలో బ్రెడ్ కోసం క్యూలో నిలబడివున్న 10 మందిని రష్యా సైనికులు కాల్చిచంపారు. ఈ దారుణ ఘటనను కీవ్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కూడా ధ్రువీకరించింది. స్కాడోవ్స్ మేయర్ ఒలెక్సాండర్ యూకోవ్లీవ్తో పాటు డిప్యూటీ మేయర్ యూరీ పల్యూఖ్ను రష్యా సేనలు అపహరించినట్టు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ట్విట్టర్లో పేర్కొన్నారు.
9/11 దాడుల ప్రస్తావన
జెలెన్స్కీ బుధవారం అమెరికా కాంగ్రెస్ జాయింట్ సెషన్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. రష్యాపై పోరులో సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా 9/11 దాడులు, 1941లో పెరల్ హార్బర్లో జరిగిన బాంబు దాడులను గుర్తుచేశారు. ప్రపంచానికి నాయకుడిగా ఉండటమంటే ప్రపంచ శాంతికి నాయకత్వం వహించడమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఉద్దేశించి జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల చర్చల్లో భాగంగా కొన్ని అంశాలకు సంబంధించి అంగీకారాలు ఒప్పందానికి దగ్గరగా ఉన్నాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ పేర్కొన్నారు. అయితే తటస్థ దేశంగా ఉండాలన్న రష్యా ప్రతిపాదనను చర్చల సందర్భంగా ఉక్రెయిన్ తిరస్కరించింది. మరోవైపు, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ రష్యా భద్రతా మండలి కార్యదర్శి జనరల్ నొకోలాయ్ పట్రుషెవ్ మధ్య సంప్రదింపులు జరిగినట్టు వైట్‌హౌస్ వెల్లడించింది.