ఒకే ఒక్క కుక్క. దీంతో ఏమవుతుందిలే? ఆరోగ్యం బాగో లేదు కదా.. విడిచేద్దాం.. అనుకున్నారు రష్యా సైనికులు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో రష్యా ఆర్మీ ఓ జాగిలం ఆరోగ్యం బాగోలేదని ఉక్రెయిన్‌లోనే వదిలేశారు. దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అంతే… ఆ కుక్కే ఇప్పుడు రష్యా ప్రభుత్వానికి ఏకుమైకై కూర్చుంది. ఈ హఠాత్ ఘటనతో పుతిన్‌కు ఏం చేయాలో అర్థం కావడం లేదట.
ఆ ఆర్మీ జాగిలం పేరు మాక్స్. దానికి మూడేళ్లు. బెల్జియం మాక్స్ జాతికి చెందిన రష్యా ఆర్మీ జాగిలం అది. దాని ఆరోగ్యం బాగోలేదని రష్యా సైనికుల్లోని ఓ టీమ్… దానిని ఉక్రెయిన్‌లోని వదిలేసింది. ఆరోగ్యం బాగో లేదని ఏం చేస్తుందిలే అనుకున్నారో? ఏమో గానీ.. నిర్లక్ష్యంగా యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్‌లో వదిలేశారు.
ఈ సమయంలో మాక్స్ తీవ్ర అనారోగ్యానికి గురైంది. చెత్తా, చెదారం, కుళ్లిన ఆహారం తింటూ జీవించేస్తోంది. ఇంతలో ఉక్రెయిన్‌కు చెందిన ఓ ఆర్మీ టీమ్ దీనిని చూసింది. ఇది కచ్చితంగా రష్యా ఆర్మీ కుక్కే అని గుర్తించింది. దానికి మొత్తం సపర్యలు చేసింది. మంచి బలవర్ధకమైన ఆహారాన్ని పెట్టింది. దీంతో ఆ రష్యా జాగిలం… ఎప్పటి లాగే బలిష్ఠంగా తయారైంది.
అంతేకాకుండా ఆ జాగిలం మైండ్ సెట్‌ను ఉక్రెయిన్ సైనికులు మెళ్లి మెళ్లిగా మార్చేశారు. అధునాతనమైన ట్రైనింగ్ ఇచ్చారు. కొత్త కొత్త మందులు దానికి ఇస్తున్నారు. ఇంతకు పూర్వం ఆ జాగిలం కేవలం రష్యా సైనికుల మాటలు మాత్రమే వినేది. కానీ.. ఇప్పుడు ఉక్రెయిన్ సైనికులు ఇచ్చిన ట్రైనింగ్ వల్ల ఉక్రెయిన్ సైనికులకు పూర్తిగా ఉపయోగపడుతోంది.
ఇప్పుడు ఆ రష్యా జాగిలం ఉక్రెయిన్ సైనికులు చెప్పినట్లు వింటోంది. కూర్చోమంటే కూర్చుంటోంది. పరిగెత్తమంటే పరిగెత్తుతోంది. రష్యా పెట్టిన మందుపాతరలను గుర్తించి, నిర్వీర్యం చేయడంలో ఈ మాక్స్ అన్న జాగిలం ఉక్రెయిన్ సైనికులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. రష్యా బాంబులను నిర్వీర్యం చేసి, ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలను కాపాడటంలో కీలకంగా ఉంటోంది.