Zelensky : రష్యా అధ్యక్షుడు (Russia president) వ్లాదిమిర్ పుతిన్ (Vlodimir Putin) తో ప్రత్యక్ష చర్చలకు తాను సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు (Ukraine president) వాలోదిమిర్ జెలెన్స్కీ (valodimir Zelensky) ప్రకటించారు. అయితే ఇస్తాంబుల్ వేదికగా చర్చలకు పుతిన్ ఆహ్వానించిన విషయాన్ని ఆయన నేరుగా ప్రస్తావించలేదు. కానీ ‘ఎట్టకేలకు రష్యా యుద్ధం ముగించే విషయాన్ని పరిశీలిస్తోంది’ అని పేర్కొన్నారు. చాలా రోజుల నుంచి ప్రపంచం మొత్తం ఇందుకోసమే ఎదురు చూస్తోందన్నారు.
యుద్ధం ముగింపులో మొదటి అడుగు కాల్పుల విరమణే అని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఈ మారణకాండను ఒక్కరోజు కొనసాగించడంలో కూడా అర్థం లేదని వ్యాఖ్యానించారు. రష్యా కాల్పుల విరమణ ధ్రువీకరణ కోసం ఎదురు చూస్తున్నామని, రష్యా ప్రతినిధులను కలిసేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కాగా సోమవారం నుంచి మొదలయ్యే 30 రోజుల కాల్పుల విరమణను రష్యా ఉల్లంఘిస్తే.. మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ సహా పలువురు యూరప్ దేశాల అధినేతలు హెచ్చరిస్తున్నారు.
ఇదిలావుంటే కీవ్‌తో ప్రత్యక్ష చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఈ మేరకు ఇస్తాంబుల్‌ను చర్చల వేదికగా ప్రకటించారు. ఈ చర్చల ద్వారా పూర్తిస్థాయి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే తాము మానవతా దృక్పథంతో ఉక్రెయిన్‌కు చెందిన ఇంధన వనరులపై దాడులను ఆపేశామని, ఈస్టర్ కాల్పుల విరమణ, ‘విక్టరీ డే’ కాల్పుల విరమణ వంటివి ప్రకటించామని గుర్తుచేశారు.