Ukraine vs Russia : రష్యా (Russia) కు ఉక్రెయిన్ (Ukraine) మరో షాకిచ్చింది. సమర రీజియన్‌లోని సిజ్రాన్ చమురు శుద్ధి కర్మాగారంపై కీవ్ డ్రోన్లు మెరుపు దాడి చేశాయి. దాంతో ఆయిల్ రిఫైనరీ (Oil refinary) కి భారీ నష్టం వాటిల్లింది. జూలై 11-12 మధ్యలో ఈ దాడులు చోటు చేసుకొన్నాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు వెల్లడంచారు. ఈ రిఫైనరీ ఏటా 8.5 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురును ప్రాసెస్ చేయగలదు.
ఆ రిఫైనరీ నుంచి సమర రీజియన్‌కు అవసరమైన పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్ వెళ్తాయి. వాటిని రష్యా సైనిక దళాలు కూడా వినియోగిస్తాయి. దీనిని రోస్నెఫ్ట్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. తాజా దాడితో ఇక్కడ కార్యకలాపాలను నిలిపివేశారు. గతంలో ఈ రిఫైనరీని లక్ష్యంగా చేసుకొని ఏప్రిల్ 18, మే 11వ తేదీల్లో ఉక్రెయిన్ దాడులు చేసింది. ఉక్రెయిన్ ఇక్కడితో ఆగకుండా అజోవ్ సముద్రంలో 10 ట్యాంకర్లు, నాలుగు ఫెర్రీలను కూడా ధ్వంసం చేసింది.
అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకుంటూ ఈ ట్యాంకర్లు రష్యా చమురును విక్రయిస్తుంటాయి. ఇక ధ్వంసమైన ఫెర్రీలు రష్యా సేనలకు లాజిస్టిక్స్ అవసరాలు, కార్గో తరలింపునకు వినియోగిస్తున్నారు. జూలై 11న భారీగా లూబ్రికెంట్ ఆయిల్ తరలిస్తున్న ఓ రైలును టోక్మాక్ వద్ద ఉక్రెయిన్ దళాలు ధ్వంసం చేశాయి. దాంతోపాటు పెద్ద ఎత్తున చమురు ట్యాంకర్లపై దాడులు చేసినట్లు ఉక్రెయిన్ రక్షణ దళాలు ప్రకటించుకొన్నాయి.