ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడిలో 400 మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ ప్రకటించారు. 800 మంది గాయాల పాలయ్యారని తెలిపారు. అయితే ఇదేమీ కచ్చితమైన లెక్కలు కావని, ఓ అంచనాకు మాత్రమే తాము వచ్చామని స్పష్టం చేశారు. ఇక 38 మంది చిన్న పిల్లలు మరణించగా, 70 మంది గాయాల పాలయ్యారని ఆయన వివరించారు. ఇక సుమీ నగరంపై 500 కేజీలున్న బాంబులను రష్యా వేసిందని ఉక్రెయిన ఆరోపిస్తోంది. ఈ ఘటనలో 18 మంది పౌరులు మరణించారని ఆరోపించింది.
ఇక రష్యా మరోమారు తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించింది. కీవ్, పోల్, ఖార్కివ్, సుమీ నగరాల నుంచి పౌరులు సురక్షితంగా తరలివెళ్లేందుకు ఈ విరమణ ప్రకటిస్తున్నట్లు రష్యా పేర్కొంది. అయితే.. మానవ కారిడార్లపై కూడా రష్యా విరుచుకుపడుతోందన్న ఆరోపణలు వచ్చాయి. దాదాపు 3 లక్షల మంది పౌరులను రష్యా దళాలు బంధించాయని ఉక్రెయిన్ ఆరోపించింది.