రష్యా సైనిక చర్యలతో అల్లకల్లోలంగా మారిన ఉక్రెయిన్.. తమకు యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలని చాలా రోజులుగా కోరుతోంది. తమకు మద్దతుగా నిలవాలని, ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో తమకు ఈయూ సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఈ విషయంలో తొందర పడకూడదని ఈయూ భావిస్తోంది.
తాజాగా ఫ్రాన్స్ యూరోపియన్ అఫైర్స్ మంత్రి క్లీమెట్ బ్యూన్ ఈ విషయంపై స్పందించారు. ఉక్రెయిన్ సంక్షోభం గురించి చర్చించేందుకు ఈయూ నేతలు ఫ్రాన్స్‌లో కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్‌కు ఈయూ సభ్యత్వం ఇవ్వడానికి సమయం పడుతుందని బ్యూన్ అన్నారు. ఈయూలో ఉక్రెయిన్‌కు ఫాస్ట్ ట్రాక్ సభ్యత్వం ఇవ్వాలనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది.
ఉక్రెయిన్‌పై సైనిక చర్యలు చేసిన రష్యాపై ఈయూ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దశల వారీగా రష్యన్ చమురు, గ్యాస్, బొగ్గు కొనుగోళ్లను నిలిపివేయాలని ఈయూ నిర్ణయించింది. ఉక్రెయిన్‌పై రష్యా చర్యల నేపథ్యంలో వారిపై ఎంత తక్కువ ఆధారపడితే అంత మంచిదనే ఉద్దేశ్యంతోనే ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు ఈయూ ప్రతిపాదించింది. అయితే ఉక్రెయిన్‌కు ఈయూ సభ్యత్వం ఇచ్చే విషయంలో ఫాస్ట్ ట్రాక్ విధానాన్ని అనుసరించడం మాత్రం జరిగేలా లేదు.