రష్యాపై ఉక్రెయిన్ మరోమారు సంచలన ఆరోపణలకు దిగింది. ఉక్రెయిన్‌కు చెందిన చమురు ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తి చేసే ప్రాంతాలపై దాడులకు దిగుతోందని ఉక్రెయిన్ మంత్రి వాడ్యమ్ డెనీసెంకో ఆరోపించారు. అంతేకాకుండా ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా మరింత బలగాలను మోహరిస్తోందని ఆయన పేర్కొన్నారు.
పౌరులే లక్ష్యంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఖార్కీవ్లో ఆహారం కోసం క్యూలో నిల్చున్న పౌరులపై రష్యా బాంబు దాడిలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లీవ్ నగరంపై శనివారం రష్యా రెండు రాకెట్ దాడులు చేసింది. ఈ ఘటనల్లో ఐదుగురికి గాయాలయ్యాయి.
మరియుపోల్‌లో పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయని, నగరంలో వీధి పోరాటాలు జరుగుతున్నాయని నగర మేయర్ తెలిపారు. ఖేర్సన్ సమీపంలో జరిపిన దాడిలో రష్యాకి చెందిన లెఫ్టినెంట్ జనరల్ యాకోవ్ రెజాన్‌త్సెవ్ మృతిచెందినట్టు ఉక్రెయిన్ రక్షణశాఖ వెల్లడించింది. వాయువ్య ఉక్రెయిన్‌లోని జైతోమిర్ నగర సమీపాన ఉన్న ఆయుధ డిపోను నాలుగు క్యాలిబర్ క్షిపణులతో ధ్వంసం చేశామని రష్యా తెలిపింది. మరోవైపు తొలి దశ యుద్ధం ముగిసిందని రష్యా ఆర్మీ ప్రకటించింది.