ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించి నేటికి 14 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు వేలాది మంది ఉక్రెయిన్ సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో మరో విషాదం చోటుచేసుకున్నది. ఉక్రేనియన్ నటుడు, గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ పాషా లీ తన దేశాన్ని రక్షించడంలో ప్రాణాలు కోల్పోయాడు.
33 ఏండ్ల వయసున్న పాషా లీ యుద్ధం కారణంగా నటనను విడిచిపెట్టారు. టెరిటోరియల్ డిఫెన్స్ యూనిట్లో చేరి ముందు వరుసలో ఉంటూ సైన్యం సూచనలను పాటిస్తున్నాడు. మార్చి 6 న ఇర్పిన్ బాంబు దాడిలో పాషా లీ మరణించాడు. ఈ సమాచారాన్ని ఒడెస్సా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.
పాషా లీ ఉక్రెయిన్‌లో నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి పేరు గడించాడు. డబ్బింగ్ కళాకారుడు, గాయకుడు, సంగీత స్వరకర్తగా కూడా పాషా లీ చిరపరిచితుడు. టీవీ కమర్షియల్‌తో కెరీర్ ప్రారంభించిన పాషా లీ.. 2006లో ‘స్టోల్న్యా’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. ‘షాడో ఆఫ్ ది అన్‌ఫర్‌గాటెన్ యాన్సిస్టర్’, ‘ది ఫైట్ రూల్స్’ ‘మీటింగ్స్ ఆఫ్ క్లాస్మేట్స్’ వంటి సినిమాలు అయనకు ఎంతో పేరు తెచ్చాయి.