(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): వైద్యరంగంలో ఇప్పటివరకూ చేపట్టిన వినూత్న ప్రయోగాలు దాదాపుగా మానవాళి క్షేమాన్ని కోరేవిగానే ఉన్నాయి. అయితే, యూకేలోని శాస్త్రవేత్తలు తాజాగా మొదలుపెట్టిన ఓ ప్రయోగం మానవాళికి గొప్పవరమని కొందరు చెప్తుండగా, ఇది ఊహించని శాపంగా మారబోతుందని మరికొందరు వాదిస్తున్నారు. ఆ ప్రయోగమే.. ‘ఆర్టిఫిషియల్ హ్యూమన్ డీఎన్ఏ ఎక్స్పరిమెంట్’
జీవుల పరిణామం, వారసత్వం, వ్యాధులు ఇలా సమస్త లక్షణాలను నిర్ణయించే ఓ అద్భుతమైన జన్యు పదార్థమే డీఎన్ఏ. ప్రతీవ్యక్తిలో డీఎన్ఏ ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఈ డీఎన్ఏ సహజసిద్ధంగా సంక్రమిస్తుంది. అయితే, ప్రయోగశాలల్లో కృత్రిమ రసాయనాలతో ఆర్టిఫిషియల్ డీఎన్ఏను తయారు చేయడానికి యూకే సైంటిస్టులు సిద్ధమయ్యారు. ‘ఆర్టిఫిషియల్ హ్యూమన్ డీఎన్ఏ ఎక్స్పరిమెంట్’గా పిలుస్తున్న ఈ ప్రయోగానికి ప్రపంచంలోనే అతిపెద్ద మెడికల్ చారిటీ ది వెల్కమ్ ట్రస్ట్.. 13 మిలియన్ డాలర్లను (రూ. 111 కోట్లు) విరాళంగా ఇచ్చింది.
డీఎన్ఏ నిర్మాణం, దాని ఉపయోగాల గురించి తెలుసుకోవడానికి 25 ఏండ్ల కిందటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనే ప్రోగ్రామ్ మొదలైంది. ఈ పరిశోధన ద్వారా ఎన్నో విప్లవాత్మకమైన ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చాయి. అయితే, మనుషుల్లో రోగనిరోధక వ్యవస్థ క్షీణించడం, కాలేయం, గుండె వంటి కీలక అవయవాలు దెబ్బతినడం, క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు, డయాబెటిస్ వంటి పారంపర్య వ్యాధులు, వృద్ధాప్యం వంటి సమస్యలకు ఈ పరిశోధన ఇప్పటివరకూ సరైన ప్రత్యామ్నాయాలను చూపించలేకపోయింది. దీంతో కృత్రిమ డీఎన్ఏను తయారు చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ తాజా ప్రయోగాన్ని ప్రారంభించారు.
కృత్రిమ డీఎన్ఏ సాయంతో మనుషుల ఆయుఃప్రమాణం పెరుగుతుందని, ప్రాణాంతక వ్యాధులకు చికిత్స అందుబాటులోకి వస్తుందని డాక్టర్ జూలియన్ సాలే అంటున్నారు. వయసు పెరగడాన్ని నెమ్మదింపజేయడమే కాకుండా రోగాలను ఎదుర్కొనే శక్తిని కూడా ఈ కృత్రిమ డీఎన్ఏ ద్వారా సాధించవచ్చని చెప్తున్నారు. పాడైపోయిన కాలేయ కణాలు, గుండెను కూడా బాగు చేయవచ్చని అంటున్నారు. కృత్రిమ డీఎన్ఏతో జీవాయుధాలను తయారు చేసే ప్రమాదం ఉన్నదని, ఇదే జరిగితే మానవాళికి ముప్పు అని ప్రొఫెసర్ బిల్ ఎర్న్షా, డాక్టర్ పాట్ థామస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ డీఎన్ఏతో వింత జంతువులు, ప్రాణాంతక వైరస్లను రూపొందిస్తే, దానికి బాధ్యులెవరని ప్రశ్నిస్తున్నారు.