Pension Money | పెన్షన్ డబ్బుల కోసం కక్కుర్తి పడిన ఓ వ్యక్తి తన స్నేహితుడి శవాన్ని రెండేండ్ల ఫ్రిజ్‌లో ఉంచాడు. ఈ ఘటన బ్రిటన్‌లో 2018లో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. జాన్ వైన్‌రైట్(71), డామిన్ జాన్సన్(52) కలిసి క్లీవ్‌ల్యాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో నివాసం ఉంటున్నారు. అయితే జాన్ వైన్‌రైట్‌కు ప్రతి నెల పెన్షన్ వస్తుంది. ఈ క్రమంలో డామిన్ జాన్సన్, వైన్‌రైట్ కలిసి జాయింట్ ఖాతా ఓపెన్ చేశారు. వైన్‌రైట్‌కు వచ్చే పెన్షన్ డబ్బులు కూడా ఆ జాయింట్ ఖాతాలోనే జమ అయ్యేవి. దీంతో ఆ నగదును ఇద్దరు డ్రా చేసేవారు. అయితే 2018, సెప్టెంబర్‌లో జాన్ వైన్‌రైట్ చనిపోయాడు. ఈ విషయాన్ని డామిన్ బయటకు చెప్పలేదు. పెన్షన్ డబ్బుల కోసం కక్కుర్తి పడి.. స్నేహితుడి శవాన్ని ఇంట్లోని ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు. ఇక నెల నెల వచ్చే వైన్‌రైట్ పెన్షన్ డబ్బులతో డామిన్ జల్సాలు చేస్తున్నాడు. కేవలం ఏటీఎం ద్వారానే డబ్బులను డ్రా చేసుకునేవాడు. వైన్‌రైట్ కార్డులను కూడా ఉపయోగించుకున్నాడు. ఇక సెప్టెంబర్ 23, 2018 నుంచి మే 7, 2020 వరకు తన పర్సనల్ ఖాతాకు డామిన్ నగదును ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు.
అయితే వైన్‌రైట్ మృతి చెందిన విషయం 2020లో వెలుగు చూసింది. దీంతో పోలీసులు డామిన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో డామిన్ బ్యాంక్ ఖాతాను పరిశీలించగా, అసలు విషయం బయటపడింది. వైన్‌రైట్ 2018లో చనిపోగా, ఫ్రిజ్లోనే శవాన్ని ఉంచి, అతనికి వచ్చే పెన్షన్ డబ్బులతో జల్సాలు చేశానని డామిన్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. దీంతో అతన్ని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. జాయింట్ ఖాతాలోనే పెన్షన్ డబ్బులు క్రెడిట్ అవుతున్నందున డామిన్ విత్ డ్రా చేసుకునేందుకు అర్హుడని కోర్టు కూడా తెలిపింది. తదుపరి విచారణను నవంబర్ 7వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అయితే వైన్‌రైట్ ఎలా మరణించాడన్న విషయం మాత్రం తేలలేదు.