China vs USA : చైనా (China) తోపాటు పలు దేశాలు రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు వాటిపై నాటో (NATO), జీ7 (G7) దేశాలు టారిఫ్లు విధించాలని అమెరికా (USA) పిలుపునివ్వడంపై డ్రాగన్ కంట్రీ తీవ్రంగా స్పందించింది. కేవలం ఏకపక్షంగా వేధించేందుకు, ఆర్థిక బలప్రదర్శనకు అమెరికా ఇటువంటి చర్యలు చేపడుతోందని ఆరోపించింది. అమెరికా చెప్పినట్టు చేస్తే తాము ప్రతిచర్యలు చేపడతామని తీవ్ర హెచ్చరిక చేసింది. స్పెయిన్లోని మాడ్రిడ్లో సోమవారం నుంచి రెండు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు మొదలైన వేళ చైనా నుంచి ఈ స్పందన రావడం గమనార్హం.
రోజువారీ సాధారణ ప్రెస్ బ్రీఫింగ్స్లో భాగంగా చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లిన్ జిన్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని ఇతర దేశాల వలె రష్యాతో కూడా తమకు సాధారణ సంబంధాలున్నాయన్నారు. ఇది అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా అనుగుణంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికా చర్యలు ఏకపక్ష వేధింపులు, ఆర్థిక బలప్రదర్శనకు నిదర్శనమని మండిపడ్డారు. ఈ చర్యలు తీవ్ర స్థాయిలో అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను దెబ్బతీస్తాయన్నారు. ప్రపంచ వాణిజ్య, పారిశ్రామిక పంపిణీ వ్యవస్థలపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.
భయపెట్టడం, ఒత్తిడి చేయడం లాంటివి సమస్యలను పరిష్కరించలేవని ఎప్పుడో నిరూపితమైందని లిన్జిన్ అన్నారు. ఉక్రెయిన్ విషయంలో చైనా విధానం ఎప్పుడూ ఒక్కటేనని, కేవలం చర్చలు, సంప్రదింపులతోనే ఆచరణయోగ్యమైన పరిష్కార మార్గం లభిస్తుందని పేర్కొన్నారు. ఏకపక్ష ఆంక్షలను చైనా ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఐరోపా, అమెరికా ఇప్పటికే రష్యాతో వ్యాపార లావాదేవీలు జరుపుతున్నాయని గుర్తుచేశారు. చైనా, రష్యా సంస్థల మధ్య సహకారం ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు.