జోహన్నెస్‌బర్గ్: రెండు ఆఫ్రికన్ ఏనుగులు ఘర్షణకు దిగాయి. దీంతో అడవిలోకి సఫారీకి వెళ్లిన పర్యాటకులు కొంత భయాందోళన చెందారు. దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్, జంగిల్ సఫారీకి ఎంతో ప్రసిద్ధి. కాగా, ఇటీవల సఫారీకి వెళ్లిన కొందరు టూరిస్టులకు వింత అనుభవం ఎదురైంది. వారి వాహనాలకు సమీపంలో రెండు పెద్ద ఏనుగులు భీకరంగా పోరాడుకున్నాయి. దంతాలతో పొడుచుకుంటూ సుమారు ఐదు నిమిషాల పాటు ఘర్షణ పడ్డాయి. దీంతో టూరిస్టులు కొంత భయాందోళనకు గురయ్యారు. మరి కొందరు తమ మొబైల్ ఫోన్లు, కెమేరాలతో దీనిని చిత్రీకరించారు.
అనంతరం ఆ రెండు ఏనుగులు విభిన్నంగా ప్రవర్తించాయి. తమ మధ్య ఏమీ జరుగనట్లుగా కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఇది చూసిన పర్యాటకులు ఆశ్చర్యపోయారు. అయితే ఏనుగులు దూరంగా వెళ్లిపోవడంతో రిలీఫ్ చెందారు. ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది.