న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో టర్కీ అధ్యక్షుడు(Turkey President) తయిప్ ఎర్డగోన్ తన ప్రసంగంలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. ఇటీవల భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, అయితే ఆ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరగడం సంతోషకరంగా ఉందన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. కౌంటర్ టెర్రరిజం అంశంలో భారత్, పాక్ దేశాల మధ్య సహకారం కీలకమైందన్నారు. కశ్మీర్ ప్రజల క్షేమం కోసం ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం కశ్మీర్ సమస్యను పరిష్కరించాలని, చర్చల ద్వారా ఆ పని జరగాలని ఎర్డగోన్ అభిప్రాయపడ్డారు. దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వం ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. గత ఏప్రిల్‌లో పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, దీని వల్ల తీవ్ర సంక్షోభ పరిస్థితులు తలెత్తాయని ఎర్డగోన్ అన్నారు. యూఎన్ జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ సందర్భంగా జరిగిన జనరల్ డిబేట్లో పాల్గొని మాట్లాడారు.
ఇటీవల టర్కీ అధ్యక్షుడు పలుమార్లు కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ దేశాల ముందు ప్రస్తావించారు. గతంలో కూడా యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లోనూ కశ్మీర్ అంశం గురించి ఆయన మాట్లాడారు. పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7వ తేదీన భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాక్‌లో ఉన్న ఉగ్రస్థావరాలను భారతీయ రక్షణ దళాలు ధ్వంసం చేశాయి. మే 10వ తేదీ వరకు పాకిస్థాన్‌పై ఇండియా తీవ్రంగా అటాక్ చేసింది.